Ganesh Chaturthi 2023 :దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్ విగ్రహాలు వివిధ రూపాల్లో ఏర్పాటు చేయగా.. మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో మండపాలను అలంకరించారు. అందులో భాగంగా ఓ గణనాథుడికి రు.360 కోట్లతో నిర్వాహకులు బీమా చేయించగా.. రూ. కోట్లు విలువైన కరెన్సీ నోట్లతో ఓ వినాయకుడిని అలంకరించారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వినాయకుల విశేషాలేంటో తెలుసుకుందాం.
వినాయకుడికి రూ.360.40 కోట్లతో బీమా..
Insurance To Lord Ganesha : ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్ మహాగణపతి ఈ ఏడాదీ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏకంగా 66.5కిలోల బంగారు, 295 కిలోలకుపైగా వెండి ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులతో అలంకరించారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవం జరుపుకొంటున్న వేళ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా మండపం వద్ద మొదటిసారి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా మండపానికి రికార్డు స్థాయిలో రూ.360.40 కోట్లకు బీమా చేయించారు. ఇది భక్తులకు కూడా వర్తిస్తుందన్నారు. గతేడాది రూ.316 కోట్లకు బీమా చేయించినట్లు చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హోమం, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జీఎస్‌బీ సేవా మండల్ నిర్వాహకులు తెలిపారు.