బ్రిటిష్‌వారితో పాటు భారత్‌లో అడుగు పెట్టిన క్రికెట్‌కు (Cricket in British India) ముంబయిలో మంచి ఆదరణ లభించింది. తెల్లవారికి దీటుగా భారతీయులూ క్రికెట్ నేర్చుకున్నారు. దీంతో తొలుత తమలోతామే ఆడుకున్న ఆంగ్లేయులు ఆ తర్వాత భారతీయులతోనూ ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే, మతాల వారీగా జట్లను ప్రోత్సహించారు ఆంగ్లేయులు! ఫలితంగా యూరోపియన్లు, పార్సీలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధుల పేరిట జట్లు వెలిశాయి. ఈ జట్ల మధ్య ఏటా ముంబయిలో ఓ టోర్నీ (పెంటాంగ్యులర్) జరిగేది. 1892లో ఆరంభమైన ఈ టోర్నీకి అప్పట్లో ఇప్పటి ఐపీఎల్ అంతటి ఆదరణ ఉండేది. మ్యాచ్‌కు 25వేల మంది ప్రేక్షకులు హాజరయ్యేవారు. ఈ టోర్నీలో రాణించిన ఆటగాళ్ల పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగేవి.
మతాల వారీగా ఆటగాళ్లు పోటీపడ్డా... మొదట్లో ఆ ప్రభావం అంతగా ఉండేది కాదు. కానీ మారుతున్న దేశ రాజకీయ, సామాజిక, జాతీయోద్యమ ప్రభావం ఈ టోర్నీపైనా పడటం ఆరంభమైంది. ముఖ్యంగా... 1930 తర్వాత మతాల ఆధారంగా సాగుతున్న ఈ టోర్నీని రద్దు చేయాలనే డిమాండ్ మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు ఆవరించిన 1940లో (Cricket during World War 2) టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నీని రద్దు చేయాలనే డిమాండ్ పెరిగింది. క్రీడాకారుల్లోనూ భిన్నమైన వాదనలు వినిపించసాగాయి. ఈ పరిస్థితుల్లో గాంధీజీ సలహా తీసుకోవాలని నిర్ణయించారు హిందూ జింఖానా నిర్వాహకులు. (Gandhi British raj)
గాంధీ సైతం క్రికెటరే..
క్రికెట్‌తో గాంధీజీకి ఏం సంబంధం అనేవారూ లేకపోలేదు. కానీ గాంధీజీ కూడా ఒకప్పుడు క్రికెటరే! (Gandhi Cricket player) చిన్నప్పుడు రాజ్‌కోట్‌లో ఆయన చదువుకున్నప్పుడు పాఠశాలలో క్రికెట్, వ్యాయామం తప్పనిసరిగా ఉండేవి. వ్యాయామం అంటే అంతగా ఇష్టపడని గాంధీజీ క్రికెట్ మాత్రం బాగానే ఆడేవారని ఆయన చిన్ననాటి పాఠశాల స్నేహితుడు రతిలాల్‌గేలాభాయ్ మెహతా గుర్తు చేసుకునేవారు. అంపైరింగ్ అంటే కూడా చాలా ఇష్టపడేవారట! ఇప్పుడు సరిగ్గా ఆ అంపైరింగ్‌నే నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురైన గాంధీజీ తన నిర్ణయం తెలపటంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు.