తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత సైన్యంలో ఈ కుర్రాడెవరు..!

గల్వాన్‌ లోయను ఆక్రమించిన చైనా దళాలను నిలువరించే భారత సైనికుల బృందాన్ని మణిపూర్​కి చెందిన యువ సైనికాధికారి నడిపించినట్లు తెలుస్తోంది. చైనా విడుదల చేసిన ఓ వీడియోలో.. స్పష్టంగా కనిపిస్తోన్న ఆ కుర్రాడి గురించి నెటిజన్లు ఆరాతీస్తున్నారు. మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీగా గుర్తించిన అతడ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

galwan-valley-clash-showcases-indian-army-captain-bravery
గల్వాన్​ ఘర్షణల్లో మణిపూర్ యోధుడు

By

Published : Feb 21, 2021, 9:48 PM IST

పదో విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశాలకు ముందు సానుభూతి పొందేందుకు చైనా ఓ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఇందులో గల్వాన్‌ ఘటనలోని కొన్ని క్లిప్‌లను కూడా ఉంచింది. వీటిల్లో భారత దళాలు తమ భూభాగంలోకి వస్తున్నాయని పేర్కొంది. వాస్తవానికి భారత దళాలు చైనా ఆక్రమణలను ఖాళీ చేయించే ప్రయత్నం అది. ఈ వీడియోలో ఈశాన్య భారత దేశానికి చెందిన ఓ కుర్రాడు భారత బృందాన్ని లీడ్‌ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నెటిజన్లు ఆ కుర్రాడెవరా..? అని ఆరాతీయడం మొదలుపెట్టారు. చివరికి అతడు మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీగా తేలింది.

2018లో సైన్యంలో సోయిబా చేరాడు. ఈ కుర్ర ఆఫీసర్‌ 16 బిహార్‌ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్ ట్విటర్‌ ఖాతాలో పంచుకొన్నారు. ఈ వీడియో వెలువడిన తర్వాత అతని వివరాలపై భారత సైన్యం తొలుత గోప్యత పాటించింది. కానీ, ట్వీట్‌ తర్వాత కేంద్ర యువజన వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కూడా ధ్రువీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'మెన్షన్‌ ఆఫ్‌ డిస్పాచెస్‌' గౌరవాన్ని ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది.

ఆ రోజు దూకుడుగా..

జూన్‌ 6వ తేదీన జరిగిన భారత్-చైనా కోర్‌కమాండర్‌ స్థాయి సమావేశంలో గల్వాన్‌ లోయ వద్ద చైనా దళాలు వేసిన టెంట్లను తొలగించాలని అంగీకారానికి వచ్చారు. 15వ తేదీ సాయంత్రం 16 బిహార్‌ రెజిమెంట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కర్నల్‌ సంతోష్‌బాబు చైనా అధికారిని కలిసి జూన్‌6వ తేదీ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. ఆ సమయంలో చైనా దళాలు సంతోష్‌బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో ఆయన్ను అక్కడి నుంచి భారత స్థావరానికి తీసుకొచ్చారు. ఈ ఘటన చూసి బిహార్‌ రెజిమెంట్‌ ఆవేశంతో రగిలిపోయింది. ఘాతక్‌ కమాండోలతో కలిసి భారీ సంఖ్యలో చైనా స్థావరం వద్దకు చేరుకొని ప్రతి దాడి చేసింది. కొన్ని గంటల పాటు జరిగిన దాడితో చైనా దళాలు బిత్తరపోయాయి. ఈ ఘటనతో చైనా వైపు కూడా భారీగా మృతి చెందారు. తాజాగా చైనా విడుదల చేసిన సోయిబా మనినగ్బా రంగ్నామీ కనిపించిన దృశ్యం ఎప్పటిదో తెలియదు. కానీ, భారత దళాలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పుడే ఎందుకా వీడియో..

పదో విడత కోర్‌కమాండర్‌ చర్చలకు ముందు చైనా ఆ వీడియోను విడుదల చేసింది. భారత్‌ మొదటి నుంచి చైనా వైపు మృతుల సంఖ్య 40వరకు ఉంటుందని చెబుతోంది. చైనా మాత్రం ఆ సంఖ్యను అసలు వెల్లడించలేదు. గతంలో అమెరికా నిఘా వర్గాలు కూడా 35 మంది వరకు మరణించి ఉండొచ్చని అంచనా వేశాయి. ఉపగ్రహ చిత్రాలు, కమ్యూనికేషన్లను ఇంటర్సెప్ట్‌లు, బాధితులను తరలించడానికి వినియోగించిన అంబులెన్స్‌లను బట్టి ఈ అంచనా వేశారు. కానీ, ఇటీవల చైనాకు వ్యూహాత్మక మిత్రదేశమైన రష్యాకు చెందిన అధికారిక పత్రిక కూడా 40 మందికిపైగా చైనా జవాన్లు మృతి చెందారని వార్తను ప్రచురించింది. దీంతో చైనా వైపు మృతుల సంఖ్య భారీగా ఉందని దాదాపు నిర్ధారణ అయింది. దీంతో పరువు కాపాడుకోవడానికి గల్వాన్‌ ఘర్షణలో మృతి చెందిన నలుగురిని సీఎంసీ గౌరవించిందని పేర్కొంది. ఇక గ్లోబల్‌ టైమ్స్‌ ట్విటర్‌ విడుదల చేసిన వీడియోను చైనాలో ప్రజలు చూసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ట్విటర్‌ వాడరు. కేవలం బాహ్యప్రపంచం కోసమే దానిని విడుదల చేసింది.

ఇదీ చదవండి:'వీరసైనికుల త్యాగాలనే అవమానిస్తారా?'

ABOUT THE AUTHOR

...view details