Gaganyaan Mission Rocket Engine Test :చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం వల్ల ఇస్రో మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన మానవ సహిత అంతరిక్ష మిషన్ 'గగన్యాన్'పై పూర్తి దృష్టి సారించింది. అందులో భాగంగా తమిళనాడు.. తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో క్రయోజనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. ఇంజిన్ను 720 సెకన్ల పాటు మండించామని ఇస్రో తెలిపింది. ఈ విజయాన్ని కీలక మైలురాయిగా అభివర్ణించింది.
గగన్యాన్ మిషన్లో భాగంగా ముగ్గురు మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్లుందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఇస్రో. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగ పరీక్షలు విజయవంతమయ్యాయి. భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయనున్నారు ఈ వ్యోమగాములు. అనంతరం వీరిని సురక్షితంగా తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించింది ఇస్రో.
చంద్రుడిపై సల్ఫర్.. మరోసారి ధ్రువీకరించిన రోవర్..
Sulphur On Moon Chandrayaan 3 :చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయి. రోవర్‌లోని మరో పరికరం జాబిల్లిపై సల్ఫర్ ఉందని ధ్రువీకరించింది. రోవర్‌లో ఉన్న ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్-APXS పరికరం సల్ఫర్‌తో పాటు.. కొన్ని ఇతర చిన్న మూలకాలను కూడా గుర్తించింది. రెండు రోజుల క్రితం రోవర్‌లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ LIBS కూడా.. చంద్రుడిపై సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. అయితే చంద్రుడిపై సల్ఫర్ ఎలా వచ్చిందనే కోణంలో శాస్త్రవేత్తలు తాజా వివరణలను అభివృద్ధి చేయాల్సి వస్తుందని ఇస్రో తెలిపింది.