తెలంగాణ

telangana

ETV Bharat / bharat

G20 Declaration 2023 : 'అణ్వాయుధాల ముప్పు ఆమోదయోగ్యం కాదు'.. ఉక్రెయిన్‌ యుద్ధంపై దిల్లీ డిక్లరేషన్‌ - జీ20 సదస్సు ప్రపంచ నేతల స్పీచ్​

G20 Declaration 2023 : జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత్‌ అతిపెద్ద విజయాన్ని సాధించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై భిన్నాభిప్రాయంతో ఉన్న సభ్య దేశాల మధ్య న్యూదిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఈ శకం యుద్ధానిది కాదనే వ్యాఖ్యలతో కూడిన న్యూదిల్లీ డిక్లరేషన్‌ను జీ20 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అణ్వాయుధాల వినియోగం, ముప్పు ఆమోద యోగ్యం కాదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని జీ20 సభ్య దేశాలు ఖండించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు.

g20 declaration 2023
g20 declaration 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 6:46 PM IST

Updated : Sep 9, 2023, 10:21 PM IST

G20 Declaration 2023 :రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఉద్దేశించి గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్లుగానే ఈ శకం యుద్ధానిది కాదనే వ్యాఖ్యలతో కూడిన న్యూదిల్లీ డిక్లరేషన్‌ను జీ20 సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, వివాదాలను దౌత్యం, చర్చలు వంటి మార్గాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని న్యూదిల్లీ డిక్లరేషన్‌ పిలుపునిచ్చింది.

'అణ్వయుధాల వినియోగం, ముప్పు ఆమోదయోగ్యం కాదు..'
G20 Declaration Delhi : ఉక్రెయిన్‌ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐరాస భద్రతా మండలి, ఐరాస సాధారణ సభలో ఆమోదించిన తీర్మానాలను డిక్లరేషన్‌ పునరుద్ధాటించింది. అన్ని దేశాలు పూర్తిగా UN చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొంది. న్యూదిల్లీ డిక్లరేషన్‌ను జీ20లో అన్ని సభ్య దేశాలు ఆమోదించినట్లు ప్రధాని నరేంద్రమోదీ కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. అణ్వయుధాల వినియోగం, ముప్పు ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

యుద్ధ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ముప్పు!
G20 Delhi Declaration Adopted : అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికైన జీ20.. భౌగోళిక రాజకీయ, భద్రతా సమస్యల పరిష్కారానికి వేదికకాదని చెబుతూనే యుద్ధ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయని జీ20 నేతలు అంగీకరించారు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న బాధలు, ప్రపంచ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధిరేటు మందగించడం వంటి అంశాలను డిక్లరేషన్‌లో హైలట్‌ చేశారు.

Delhi G20 Declaration : ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలపై యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉందని జీ20 దేశాలు అభిప్రాయపడ్డాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మనీలాండరింగ్‌ అంశాలు జీ20 సదస్సులో చర్చకు వచ్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ వెల్లడించారు. ఉగ్రవాదం అన్ని రూపాలనూ జీ20 సభ్య దేశాలు ఖండించినట్లు తెలిపారు.

4సార్లు రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ అంశం..
G20 Delhi Declaration Ukraine :దాదాపు 37 పేజీలతో ఈ రూపొందించిన ఈ న్యూదిల్లీ డిక్లరేషన్‌లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నాలుగు సార్లు ప్రస్తావించారు. ముఖ్యంగా అణు బెదిరింపులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్న అంశంపై అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

యుద్ధంపై డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలు..

  • ఐరాస ఛార్టర్‌కు అనుగుణంగా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి, రాజకీయ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ప్రాదేశిక దురాక్రమణలకు దూరంగా ఉండాలని డిక్లరేషన్ పేర్కొంది. అణ్వాయుధాలను చూపి బెదిరించడాన్ని ఏ మాత్రం ఆమోదించమని వెల్లడించింది.
  • ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ప్రజలపై అదనంగా వచ్చి పడిన ఆహార,ఇంధన సంక్షోభాలు, పంపిణీ వ్యవస్థల ఛిన్నాభిన్నం, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం వంటివి ఆయా దేశాల పాలనను కష్టతరం చేస్తున్నాయని తీర్మానం అభిప్రాయపడింది.
  • రష్యన్‌ ఫెడరేషన్‌, ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం, ఆహార పదార్థాలు, ఎరువులు, ఇతర ముడి పదార్థాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా సరఫరా చేయాలని పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆఫ్రికాలోని పేద దేశాల అవసరాలు తీర్చుకోవడానికి ఇది అవసరమని తెలిపింది.
  • సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు, దానికి తగిన యత్నాలు, దౌత్యం, చర్చలు చాలా ముఖ్యమైనవని ఈ డిక్లరేషన్‌ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం కారణంగా పడుతున్న దుష్పరిణామాలను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఉపయోగపడే అన్ని సంబంధిత నిర్మాణాత్మక చర్యలను స్వాగతిస్తామని వెల్లడించింది.

అంతా అలా భావించినా..
Russia Ukraine War G20 : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన వేళ.. న్యూదిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాలు ఆమోద ముద్ర వేయడం కష్టమని అంతా భావించారు. డిక్లరేషన్‌ లేకుండానే చరిత్రలో తొలిసారి జీ20 సదస్సు ముగుస్తుందని అనుమానించారు. అయితే న్యూదిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాలను ఒప్పించడంలో భారత్‌ సఫలమైంది. దీన్ని భారత్‌ సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు.

'జీ20 దిల్లీ డిక్లరేషన్​.. ఓ చరిత్ర..'
G20 Declaration Modi :దిల్లీ జీ20 డిక్లరేషన్​కు ఏకాభిప్రాయం కుదరడం.. ఓ చరిత్ర అని ప్రధాని మోదీ తెలిపారు. డిక్లరేషన్​కు ఏకాభిప్రాయం కుదిరిన స్ఫూర్తితో మెరుగైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం ఐక్యంగా పని చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు మోదీ చెప్పారు. దిల్లీ డిక్లరేషన్​కు మద్దతుతో పాటు సహకారం అందించిన జీ20 సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోదీ ట్వీట్​ చేశారు.

అనేక సవాళ్లను పరిష్కరించాలి : జీ20 దేశాల నేతలు
G20 Rishi Sunak India Visit : వాతావరణ కూటమిసహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందని జీ20దేశాల నేతలు పిలుపునిచ్చారు. ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచవృద్ధిని పునరుద్ధరించేందుకు 15ఏళ్లక్రితం జీ20 దేశాల నేతలు తొలిసారి కలిసినట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. ప్రపంచం ముందు ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు నాయకత్వం వహించాలని ప్రపంచమంతా మరోసారి జీ20వైపు చూస్తోందన్నారు. జీ20 దేశాలు కలిసికట్టుగా సవాళ్లను పరిష్కరించగలవని నమ్ముతున్నట్లు సునాక్‌ ధీమా వ్యక్తం చేశారు.

ప్రపంచ సమీకరణ కోసం టాస్క్‌ఫోర్స్‌!
G20 2024 Presidency : జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ సమీకరణ కోసం టాస్క్‌ఫోర్స్‌ ప్రారంభించనున్నట్లు బ్రెజిల్‌ అధ్యక్షుడు లుయిజ్‌ డిసిల్వా తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రపంచ పునర్నిర్మాణం.. తక్కువ-కార్బన్, వాతావరణ స్థితిస్థాపక, స్థిరమైన సమాజాల దిశగా వేగంగా పరివర్తన చెందటానికి ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోస అన్నారు.

దిల్లీ శిఖరాగ్ర సమావేశాలు కీలకం!
G20 Summit 2023 Delhi :వాతావరణ మార్పులు మనుషుల తయారు చేసినవని, అందువల్ల దాన్ని పరిష్కరించవచ్చని యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డేర్‌ అన్నారు. అందుకోసం ఆవిష్కరణలు, హరిత సాంకేతికత కోసం పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, ఇంధన సామర్థ్యం అవసరమన్నారు. గ్లోబర్‌ కార్బన్‌ ప్రైసింగ్‌ పిలుపునకు జీ20 నాయకులందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్న ఈయూ అధ్యక్షురాలు.. ప్రధాని మోదీ సారథ్యంలో జరుగుతున్న దిల్లీ శిఖరాగ్ర సమావేశాలు కీలకం కానున్నాయని చెప్పారు

'ఆఫ్రికా యూనియన్​ను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా'
African Union G20 Seat :ప్రపంచ జీడీపీలో 85శాతం వాటా కలిగిన జీ20 దేశాల కూటమిలోకి ఆఫ్రికా యూనియన్​ను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. "భారతదేశం సహకార భవిష్యత్తును విశ్వసిస్తుంది. ప్రపంచ పురోగతికి మా సామూహిక నిబద్ధతను మరింత పటిష్ఠం చేస్తుంది. గ్లోబల్ సౌత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది" అని ట్వీట్​ చేశారు. జీ20 కూటమిలో ఇప్పటి వరకు ఏయూ నుంచి ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్యదేశంగా ఉంది. కానీ, ఇప్పుడు భారత్‌ చొరవ, సభ్యదేశాల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌ శాశ్వత సభ్యత్వాన్ని పొందింది. అయితే జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరడం.. వివిధ ప్రపంచ బహుపాక్షిక సంస్కరణల పట్ల ఓ సానుకూల అడుగుగా సూచిస్తుందని దక్షిణాఫ్రికా ఉన్నతాధికారి తెలిపారు.

భారత్​, అమెరికా, బ్రెజిల్​, దక్షిణాఫ్రికా సంయుక్త ప్రకటన..
"దిల్లీ వేదికగా జీ20 పట్ల మా భాగస్వామ్య నిబద్ధతను పునరుద్ఘాటించడానికి భారత్​, అమెరికా, బ్రెజిల్​, దక్షిణాఫ్రికా దేశాధినేతలు కలుసుకున్నాం. ప్రపంచంలోని సమస్యల పరిష్కారాల కోసం అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందించుకుంటాం. ప్రస్తుత భారత్​తోపాటు తర్వాత మూడేళ్లలో జీ20కి అధ్యక్షత వహించే దేశాలుగా.. ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు భారత్ జీ20 ప్రెసిడెన్సీ నిర్ణయాల్లో పురగోతిని సాధిస్తాం. ఈ స్ఫూర్తితో.. ప్రపంచ బ్యాంక్​ అధ్యక్షుడితో కలిసి.. మెరుగైన, ప్రభావంతమైన బహుపాక్షిక బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు జీ20 నిబద్ధతను స్వాగతిస్తాం. ప్రజలకు మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేస్తాం" అంటూ జీ20 సదస్సులో భారత్​, అమెరికా, బ్రెజిల్​, దక్షిణాఫ్రికా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

Modi Sunak Bilateral Talks : రిషి సునాక్​తో మోదీ ద్వైపాక్షిక చర్చలు.. బైడెన్​తో బంగ్లా ప్రధాని సెల్ఫీ

ప్రపంచం కోసం భారత్.. జీవ ఇంధన కూటమి ఏర్పాటు.. వారందరికీ మోదీ పిలుపు

Last Updated : Sep 9, 2023, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details