Free Ration Scheme Extended :కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు వచ్చే ఐదేళ్లలో రూ.11.8లక్షల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను కేంద్రం.. దేశంలో కొవిడ్ విజృంభించిన సమయంలో పేదలకు అండగా ఉండేందుకు 2020లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులకు ఒకరికి 5కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం 2023 డిసెంబరు 31తో గడువు ముగియగా.. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయంతో మరో ఐదేళ్లపాటు కొనసాగనుంది.
మరోవైపు.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను రాబడిని పంచుకోవడంపై నిర్ణయం తీసుకునే 16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 16వ ఆర్థిక సంఘం తన నివేదికను 2025 అక్టోబర్ నాటికి సమర్పిస్తుందని.. 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి సిఫార్సులు చెల్లుబాటు అవుతాయని చెప్పారు.