దిల్లీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 1.34 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ కొనుగోలుకు ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ కొనుగోలును వేగవంతం చేసి.. ప్రజలకు వాటిని అందించేందుకు దిల్లీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని కేజ్రీవాల్ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్లకు ఒకే ధర ఉండాలన్న కేజ్రీవాల్.. టీకా ధరను తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా టీకా ధర తగ్గించాలని ఆయన వ్యాక్సిన్ తయారీ సంస్థలను కూడా కోరారు. ఇది మానవాళికి సహాయం చేయాల్సిన సమయమని.. ఈ సమయంలో లాభాపేక్ష ఉండకూడదని కేజ్రీవాల్ అన్నారు.
500 పడకల ఆస్పత్రి..
దిల్లీలోని ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) ఆధ్వర్యంలోని సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ సోమవారం ప్రారంభమైంది. ఛతార్పుర్లో ఉన్న ఈ ఆస్పత్రిని సీఎం కేజ్రీవాల్ సందర్శించారు.