తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తౌక్టే' బీభత్సం- కర్ణాటకలో నలుగురు మృతి - తౌక్టే తుపాను మరణాలు

'తౌక్టే' తుపాను ధాటికి తీర ప్రాంత రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కర్ణాటకలో వర్షాలు, వరదల కారణంగా నలుగురు మృతి చెందారు. ఆ రాష్ట్రంలోని దాదాపు 73 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంది. కేరళలో భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. మరోవైపు.. సహాయక చర్యల నిమిత్తం 101 బృందాల ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు వివిధ రాష్ట్రాల్లో మోహరించాయి.

Cyclone Tauktae
తౌక్టే బీభత్సం- కర్ణాటకలో నలుగురు మృతి

By

Published : May 16, 2021, 4:56 PM IST

'తౌక్టే' తుపాను ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. తుపాను ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు కరుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా నలుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. దాదాపు 73 గ్రామాలు సహా 7 జిల్లాల్లోని 17 తాలుకాలపై 'తౌక్టే' తుపాను ప్రభావం ఉన్నట్లు చెప్పారు.

ఈ 73 గ్రామాల్లో 28 గ్రామాలు ఒక్క ఉడుప్పి జిల్లాకు చెందినవేనని అధికారులు తెలిపారు. వర్షాల ధాటికి మృతి చెందిన నలుగురు.. ఉత్తర కన్నడ, ఉడుప్పి, చిక్కమంగళూరు, శివమొగ్గ జిల్లాలకు చెందిన వారని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి 318 మందిని తరలించినట్లు తెలిపారు. వారిలో 298 మందికి 11 పునరావాస శిబిరాల్లో ఆశ్రయం కల్పించామని పేర్కొన్నారు.

సీఎం సమీక్ష..

వర్షాల కారణంగా కర్ణాటకలో 112 ఇళ్లు, 139 విద్యుత్​ స్తంభాలు, 22 ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం తీరప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ దళాలను సిద్ధంగా ఉంచింది. తీరప్రాంత జిల్లాల అధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం సమావేశమయ్యారు. సహాయక చర్యలు వేగవంతగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

కేరళలో వర్ష బీభత్సం..

కేరళ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ.. వర్షాలతో ఆ రాష్ట్రంలోని పలు జలశలాయాల్లో ఆదివారం నీటి మట్టం భారీగా పెరిగింది. కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం 'ఆరెంజ్'​ హెచ్చరికలు(భారీ నుంచి అతి భారీ వర్షాలు) జారీ చేసింది. పెరింగల్​కుత్తు జలాశయంలో నీటి మట్టం 419.41 మీటర్లు దాటితే.. డ్యామ్​ గేట్లు తెరుస్తామని అధికారులు తెలిపారు.

కేరళలో దెబ్బతిన్న ఇళ్లు
అలల ధాటికి ధ్వంసమైన ఇల్లు
కూలిపోయిన ఇల్లు

కేరళలో తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వందలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లోని ఎన్నో ఇళ్లు దెబ్బతిన్నాయి.

101 బృందాలతో సహాయక చర్యలు..

తౌక్టే తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ చర్యల నిమిత్తం.. 101 బృందాల ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు మోహరించారు. వీరిలో 79 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో 28 బృందాలు ప్రత్యామ్నాయంగా మోహరించి పెట్టారు. ఆర్మీ, నేవీ, కోస్టు గార్డుకు చెందిన బలగాలు సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి.

ఇదీ చూడండి:తౌక్టే బీభత్సం- వణికిపోతున్న రాష్ట్రాలు

తుపానుతో పాటు కరోనాపైనా..

కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా నేతృత్వంలోని విపత్తు సంక్షోభ నిర్వహణ కమిటీ.. తుపానును ఎదుర్కోవడానికి ఆయా రాష్ట్రాల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించింది. ప్రభావిత రాష్ట్రాల్లో కరోనా చికిత్సా సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను రాజీవ్​ గౌబా ఆదేశించారు. ఎవరి ప్రాణాలకు హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గురువారం సాయంత్రానికల్లా..

తౌక్టే తుపాను వచ్చే 24 గంటల్లో మరింత ప్రమాదకరంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం సాయంత్రానికల్లా గుజరాత్ తీరాన్ని చేరుకుంటుందని వెల్లడించింది. పోర్​బందర్, మహువా(భావ్​నగర్ జిల్లా) వద్ద గుజరాత్ తీరం దాటుతుందని ఐఎండీ పేర్కొంది. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 175 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. గుజరాత్​, దమణ్ దీవ్​లకు ప్రాంతాలకు 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావంతో గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

జలమయమైన గోవా రహదారులు
గోవాలో వర్షాల ధాటికి విరిగిపడ్డ చెట్టు

నడ్డా సమావేశం..

తౌక్టే తుపాను నేపథ్యంలో తీర ప్రాంత రాష్ట్రాల్లోని భాజపా నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. విపత్తు వేళ.. ప్రజలకు తగిన సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. గోవా, దమణ్​ దీవ్​, గుజరాత్​, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి వర్చువల్​గా హాజరయ్యారు.

ఇదీ చూడండి:'తౌక్టే' తీవ్ర రూపం- అమిత్ షా సమీక్ష

ABOUT THE AUTHOR

...view details