కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పోటీతత్వ, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా జిల్లాలకూ విస్తరించాలని పిలుపునిచ్చారు.
నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన... కొవిడ్ సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా విషయంలో దేశం విజయం సాధించిందని, ప్రపంచం ముందు భారత ప్రతిష్ఠ విరాజిల్లిందని పేర్కొన్నారు.
దేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ తాజా సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
'దేశ మానసిక స్థితి మారింది'
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు మోదీ. సమయాన్ని వృథా చేయకుండా వేగంగా అభివృద్ధి సాధించాలని దేశం నిశ్చయించుకుందని చెప్పారు. దేశ మానసిక స్థితి ఈ విధంగా మారడంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు. గత కొన్నేళ్లలో బ్యాంకు ఖాతాలు తెరవడం పెరిగిందని వివరించారు మోదీ. ఉచిత విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు పేదల జీవితాల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చాయన్నారు. పేదలు సాధికారత సాధించేందుకు ఈ చర్యలు ఉపయోగపడ్డాయని తెలిపారు.