కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ పంపిణీ(Vaccination Status In India) కార్యక్రమం కొనసాగుతోందని.. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 69శాతం మందికి కనీసం ఒక డోసు టీకా(Vaccination Status In India) అందించినట్టు కేంద్రం వెల్లడించింది. 25శాతం మందికి రెండు డోసులూ పూర్తిచేసినట్టు తెలిపింది.
గత వారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 59.66శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదైనట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం కేరళలో లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం మీడియాకు వివరించారు.
"కొవిడ్ పరీక్షలు తగ్గించలేదు. ప్రతిరోజు 15 లక్షల నుంచి 16లక్షల మేర శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నాం. 30 జిల్లాల్లో కొవిడ్ వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగానే ఉంది. మరో 18 జిల్లాల్లో ఇది 5 నుంచి 10శాతంగా ఉంది. జనసాంద్రత పెరిగే ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. అనవసర ప్రయాణాలు మానుకోవడమే తెలివైన పని. తక్కువ సంఖ్యలో పాల్గొని పండుగలు జరుపుకోవాలి."
-కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ
"జైకోవ్-డి మూడు డోసుల్లో ఇచ్చే వ్యాక్సిన్. సూదిని వినియోగించకుండా ఇచ్చే ఈ టీకా ధర ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాటి ధరలకు భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నాం"అని అధికారులు తెలిపారు.
బూస్టర్ డోసు ఎప్పుడంటే..?
దేశంలోని వయోజనులందరికీ.. పూర్తి స్థాయిలో టీకా పంపిణీ చేయడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు. బూస్టర్ డోసు ఇప్పడప్పుడే అవసరం లేదని అభిప్రాయపడ్డారు.