కర్ణాటక బెంగళూరులో ఘోరం జరిగింది. రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
మృతులను యశోద (72), ఆమె కుమారుడు నరేష్ గుప్తా(36), కుమార్తె సుమన్ గుప్తా(32)గా పోలీసులు గుర్తించారు. మృతుడు నరేశ్, అతడి చెల్లి సుమన్ గుప్తాకు ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. నరేష్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అని పేర్కొన్నారు. ఈ కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు.
వరకట్న వేధింపులు తట్టుకోలేక..
అత్తింటివారు పెట్టే వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ గృహిణి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హోసకోటేలోని కల్కుంటే అగ్రహారలో జరిగింది. మృతులను శ్వేత (24), ఏడాదిన్నర వయసున్న యక్షిత్‌గా పోలీసులు గుర్తించారు. మృతురాలు శ్వేతకు రాకేశ్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల రాకేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై రాకేశ్, శ్వేత మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పంచాయితీ పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా.. వీరి మధ్య గొడవలు ఆగలేదు. రాకేశ్, అతని కుటుంబ సభ్యులు.. శ్వేతను అదనపు కట్నం తీసుకురమ్మని వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్వేత.. తన ఏడాదిన్నర చిన్నారితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై అనుగొండనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.