కల్తీ మద్యం తాగి 20 మంది చనిపోయిన ఘటన బిహార్‌లో రాజకీయ దుమారానికి దారితీసింది. మద్య నిషేదం ఉండగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంపై విపక్షాలు మండిపడ్డాయి. అసెంబ్లీలో దీనిపై దుమారం చెలరేగింది. ఓ దశలో సీఎం నీతీశ్ కుమార్ సహనం కోల్పోయారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సరన్ జిల్లా ఇషువాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. రాత్రి కొందరు వ్యక్తులు స్థానికంగా ఓ చోట మద్యం సేవించారు. అనంతరం ఇంటికొచ్చిన వారంతా తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు. అందులో 20 మంది మరణించారు. మరికొంత మంది ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా కల్తీ మద్యం తాగి చనిపోయినట్లుగానే అనుమాసిస్తున్నాం. ఆరుగురు మాత్రం ఖచ్చితంగా కల్తీ మద్యం తాగే చనిపోయిట్లుగా నిర్థారణ అయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అసలు విషయాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు. కల్తీ మద్యానికి సంబంధమున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై ప్రతిపక్షాల ఆందోళన..
ఘటనపై ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు అక్రమ మద్యం వ్యాపారుల మధ్య సంబంధం ఉందని వారు ఆరోపణలు గుప్పించారు. మరణాలకు ప్రభుత్వమే కారణమంటూ అసెంబ్లీ వెలుపల ఎమ్మెల్యేలంతా ఆందోళన చేపట్టారు. "మద్యపాన నిషేదానికి మా మద్దుతు ఎప్పుడు ఉంటుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిషేదానికి మేం మద్దతు ఇచ్చాం. కానీ దాని అమలు పూర్తిగా విఫలమైంది" అని మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిశోర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.