విదేశీ కరోనా టీకాలకు భారత్‌లో త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంపై రాహుల్ గాంధీ వ్యంగస్త్రాలు సంధించారు. మహాత్మా గాంధీ సూక్తిని ప్రస్తావిస్తూ.. కేంద్రంపై విమర్శలు చేశారు.
"మొదట నిన్ను పట్టించుకోరు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత నీపై పోరాడతారు. కానీ ఆఖరికి నువ్వే గెలుస్తావు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
విదేశీ కరోనా టీకాలకు అత్యవసర అనుమతివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. రాహుల్ గాంధీ శుక్రవారం లేఖ రాశారు. అయితే ఫార్మా కంపెనీల కోసం లాబీయింగ్ చేస్తూ.. ఏకపక్షంగా అనుమతివ్వాలని రాహుల్ కోరుతున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. ఈ నేపథ్యంలో విదేశీ టీకాలకు అనుమతులపై ఓ వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ట్వీట్ చేశారు రాహుల్.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడం కోసం విదేశాలలో అత్యవసర అనుమతి పొందిన ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి టీకాలకు భారత్‌లోనూ అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది.
'మోదీ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది'
కరోనా కేసులు పెరుగుతుంటే వాటిని కట్టడి చేయడంలో ప్రధాని మోదీ నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. వైరస్ కేసుల్ని గుర్తించడంలో మోదీ పట్టనట్టు ఉన్నారని, కనీసం సానుభూతి కూడా లేకుండా ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలో పడేశారని విమర్శించారు.
"కొవిడ్-19 కేసుల్ని గుర్తించడంలో ప్రధాని మోదీ పూర్తి నిర్లక్ష్యంగా, ఎటువంటి సానుభూతి లేకుండా, క్రూరంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రాణాల్ని కాపాడాల్సిన మందుల విషయంలో, ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకలు, వైద్యసంబంధిత పరికరాలు, వాక్సిన్లు అందుబాటులో ఉంచడంలో కేంద్రం పూర్తి నిర్లక్ష్యం వహించి, ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసింది."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
"ఇది జాతీయ అత్యవసర పరిస్థితి, కానీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మునిగిపోయారు. ప్రధాని తన రాజ ధర్మాన్ని పాటించాలి, ఇది 'నువ్వు- నేను' అంటూ విమర్శించుకునే సందర్భం కాదు. కరోనాతో మనం పోరాడాల్సిన సమయం" అని అన్నారు.
ఇదీ చదవండి:'కరోనాను జయించడానికి ప్రపంచం ఐక్యం కావాలి'