ఒకవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో పొరపాట్లు టీకా కార్యక్రమాన్ని(vaccination) వెనక్కి లాగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరి 20 మందిని ఆందోళనలోకి నెట్టింది. రెండో డోసుకు వచ్చిన వీరికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్(vaccine)కు బదులు వేరేది ఇచ్చారు. వీరంతా ఏప్రిల్‌లో తొలి డోసుగా కొవిషీల్డ్ తీసుకున్నారు. ఈ నెల 14న రెండో డోసుకు వచ్చినప్పుడు ఆరోగ్య సిబ్బంది వీరికి కొవాగ్జిన్ ఇచ్చారు.
తర్వాత పొరపాటు తెలుసుకున్న అధికారులు 20 మందిని వైద్య పరిశీలనలో ఉంచారు. ఇప్పటివరకైతే వీరిలో ఎవరికీ ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నం కాలేదన్నారు. దీనిపై స్థానిక ఆరోగ్య అధికారులు విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.