రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వీ'కి చెందిన తొలి బ్యాచ్.. వచ్చేవారం ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకునే అవకాశముంది. ఈ మేరకు రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌ను కాన్పుర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కి.. భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) నుంచి అనుమతులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు వచ్చే వారం నుంచే స్పుత్నిక్-వీ క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్బీ కమల్ వెల్లడించారు. ఇందుకోసం సుమారు 180 మంది వలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.
7నెలల సుదీర్ఘ పర్యవేక్షణ
వలంటీర్లకు ఎంత మోతాదు వ్యాక్సిన్ ఇవ్వాలనేది పరిశోధన విభాగం అధిపతి సౌరభ్ అగర్వాల్ నిర్ణయిస్తారని కమల్ తెలిపారు. టీకా తీసుకున్న అనంతరం.. వలంటీర్లను నిరంతరంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. 21రోజుల వ్యవధిలో ఇచ్చే రెండు, మూడు డోసుల పనితీరును ఏడు నెలల పాటు అధ్యయనం చేస్తామని వివరించారు.
రెడ్డీస్ ల్యాబ్‌కు కోటి డోస్‌లు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో డాక్టర్ రెడ్డీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్), రష్యన్ సావరీన్ వెల్త్ ఫండ్లు.. భారత్‌లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహణ, పంపిణీ చేపట్టేందుకు భాగస్వామ్యమయ్యాయి. ఈ ఒప్పందంలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు పది కోట్ల మోతాదుల వ్యాక్సిన్ సరఫరా చేయనుంది ఆర్డీఐఎఫ్.
ఇదీ చదవండి:'స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ 92శాతం ప్రభావవంతం'