తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం - punjab accident

punjab fire accident news
అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

By

Published : Apr 20, 2022, 9:42 AM IST

Updated : Apr 20, 2022, 8:38 PM IST

09:33 April 20

అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

పంజాబ్​లోని లుథియానాలో విషాద ఘటన జరిగింది. బిహార్​ నుంచి వలస వచ్చిన కుటుంబం ఉంటున్న గుడిసె అగ్నికి ఆహుతై ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని టిబ్బారోడ్డులో ఉన్న మున్సిపల్​ డంపింగ్​ యార్డుకు సమీపంలోని గుడిసెలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఏసీపీ సురిందర్​ సింగ్​ తెలిపారు.

మృతులు సురేశ్​ సాహ్ని(55), అతడి భార్య రీనా దేవి(53)తో పాటు వారి ఐదుగురు పిల్లలు రేఖీ, మీనాక్షి, గీతా, చాందా, రెండేళ్ల సన్నీగా టిబ్బా పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జి రన్​బిర్​ సింగ్​ గుర్తించినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఏప్రిల్​ 30న తన పెద్ద కూతురి వివాహం కోసం గురువారమే సొంత ఊరికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారని, ఆలోపే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువు రామ్​బాబు సాహ్నీ తెలిపారు. వేరే ప్రాంతంలో నిద్రిస్తున్న వీరి మరో కుమారుడు రాజేశ్‌(17) ఒక్కడే ప్రాణాలతో మిగిలారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారమందుకున్న వెంటనే సుందర్‌ నగర్‌ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారని.. అయితే, అప్పటికే వీరంతా మరణించారని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

సురేశ్​ సాహ్నీ 25 ఏళ్ల క్రితం బిహార్​ నుంచి లుథియానాకు వచ్చినట్లు పొరుగు వ్యక్తి బిందేశ్​ శర్మ తెలిపారు. మంటలు చెలరేగే కొద్ది సమయానికి ముందు ఓ ద్విచక్రవాహనం అటువైపుగా వెళ్లిన్నట్లు చూశామని పోలీసులకు చెప్పారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టాలని కోరారు. అయితే.. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పదంగా పరిస్థితులు కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఫొరెన్సిక్​ బృందం నమూనాలు సేకరించింది. సమీపంలోని రెండు సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. బంధువులకు సమాచారం అందించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇదీ చూడండి:అప్పటివరకు పెళ్లిలో సరదా సరదాగా.. కాసేపటికే ఆరుగురు శవాలై...

Last Updated : Apr 20, 2022, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details