దేశంలో మూడు వ్యవస్థల్లో ఏదీ రాజ్యాంగం కన్నా గొప్పది కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. కానీ, ఇటీవల కొన్ని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు చూస్తే.. న్యాయవ్యవస్థ పరిధి దాటి ప్రవర్తించినట్లు కనిపించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి టపాసులపై నిషేధం, కొలీజియంల ద్వారా న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వ్యవస్థ దూరంగా ఉండాలని స్పష్టంచేయడం వంటి ఉదంతాలను ఈ సందర్భంగా వెంకయ్య ప్రస్తావించారు.
గుజరాత్ కేవడియాలో అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో ప్రసంగించారు ఉపరాష్ట్రపతి. ఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో ముందుకెళితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు.
"చట్టసభలు, అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ.. ఈ అంశాలు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అప్పుడే పరస్పర గౌరవం, బాధ్యత, నిగ్రహాన్ని పెంచుతాయి. దురదృష్టవశాత్తూ.. చాలా సార్లు న్యాయవ్యవస్థ తన పరిధిని దాటినట్లు అనిపిస్తోంది. న్యాయవ్యవస్థనే అత్యున్నత శక్తిగా భావించడం మంచిది కాదు."