నూతన సాగు చట్టాల రద్దు కోసం డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తోన్న అన్నదాతలు తమ నిరసనలను రోజురోజుకు ఉద్ధృతం చేస్తున్నారు. దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 30వ రోజుకు చేరుకుంది. రైతు సంఘాల నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సింఘు, టిక్రి, గాజీపుర్ సరిహద్దుల వద్ద రైతులు బైఠాయించారు.
రైతు పోరు ఉద్ధృతం- చర్చలపై నేడు నిర్ణయం - సాగు చట్టాలపై రైతుల ఆందోళన
దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన 30వ రోజుకు చేరుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలపై ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానంపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం గురువారం మరోసారి లేఖ రాయగా రైతు సంఘాలు తోసిపుచ్చాయి. నిర్మాణాత్మక ప్రతిపాదనతో వస్తేనే చర్చిస్తామని తేల్చి చెప్పాయి. చట్టాల రద్దుపై నిర్దిష్టమైన హామీతో ముందుకొస్తేనే చర్చలకు వస్తామని స్పష్టంచేశాయి. కనీస మద్దతు ధర అంశాన్ని అజెండాలో చేర్చవద్దనడం సరికాదన్నాయి రైతు సంఘాలు. ఎమ్ఎస్పీకి చట్టబద్ధమైన హామీని సాధించుకోవడం తమ ఉద్యమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని స్పష్టం చేశాయి.
లేఖను కేంద్ర ప్రభుత్వ ప్రచార ఎత్తుగడగా అభివర్ణించారు రైతులు. ప్రభుత్వంతో చర్చకు రైతు నేతలు సిద్ధంగా లేరనే నిందను మోపే కుట్రలో భాగమని పేర్కొన్నారు. నేడు సమావేశమై కేంద్రం లేఖ విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.