ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్స్ అంటే తెలియని వారెవరూ ఉండరు. ఏ అడ్రస్ తెలియకపోయినా సరే.. దారిని చూపిస్తూ గమ్యస్థానానికి చేరవేస్తోంది. కానీ ఓ కుటుంబాన్ని మాత్రం చిక్కుల్లో పడేసింది. గూగుల్ మ్యాప్స్‌లో చూపించిన దారిలో వచ్చి వరదల్లో చిక్కుకుపోయింది ఓ కుటుంబం. కారులోని నలుగురు ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొని, చివరకు అధికారుల సాయంతో క్షేమంగా బయటపడ్డారు.
తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో గత కొన్ని రోజులుగా విపరీతమైన వర్షం కురుస్తోంది. వరదలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా హోసుర్లోని బాగేపల్లి వంతెన మునిగిపోయింది. వంతెనకు ఐదు అడుగుల పైనుంచి వరద ప్రవాహం వెళుతోంది. గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించి ప్రయాణిస్తున్న ఓ కారు వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నీటిలో చిక్కుకుపోయారు.