బంగాల్లో ఓ బోగస్ ఐఏఎస్ అధికారి.. నకిలీ వ్యాక్సినేషన్ కేంద్రం నడుపుతూ.. ఆ రాష్ట్ర అధికార పార్టీ ఎంపీనే మోసం చేశాడు. తాను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్లో(కేఎంసీ) జాయింట్ కమిషనర్‌ను అంటూ.. అమాయక ప్రజలను దోచుకుంటున్న ఆ మాయగాడు.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తికి టీకా వేయించాడు. అడ్డంగా బుక్కయ్యాడు.
ట్రాన్స్జెండర్ల కోసమంటూ.. ఎంపీకి ఆహ్వానం
దెవంజన్ దేవ్ అనే వ్యక్తి.. కేఎంసీలో డిప్యూటీ కమిషనర్‌నని చెప్పుకుంటూ.. నగరంలోని కస్బా ప్రాంతంలో నకిలీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని నడుపుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్జెండర్లు, దివ్యాంగుల కోసం నడుపుతున్న టీకా కేంద్రమని చెప్పి.. మిమీ చక్రవర్తిని ఆహ్వానించాడు. ఆమెకు కూడా టీకా వేయించాడు. వ్యాక్సిన్ తీసుకుని రెండురోజులు కావస్తున్నా.. ఇంకా ధ్రువపత్రం రాలేదు. వెంటనే విషయాన్ని ఆ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించారు మిమీ. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అటువంటి టీకా కేంద్రమేది లేదని తేల్చారు.
"ఆ వ్యాక్సినేషన్ కేంద్రం నిర్వాహకులు ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లాను. నేను కూడా టీకా వేయించుకోవాలని నిర్ణయించుకుని.. తొలిడోసు తీసుకున్నా. అయితే నా మొబైల్‌కు ధృవీకరణ పత్రం రాలేదు. దాని గురించి దేవ్‌ను అడిగాను. అందుకు అతను.. త్వరలో సర్టిఫికెట్ వస్తుందని చెప్పారు. మరోరోజు వరకు ఎదురుచూశాను. అయినా సర్టిఫికేట్ రాలేదు. నా సహచరులు మళ్లీ అడిగారు. అయితే రెండు మూడు రోజుల్లో ధ్రువపత్రం వస్తుందని వారికి చెప్పారు. నాకు సందేహాలు వచ్చాయి. సంబంధిత అధికారులకు సమాచారం అందించాను. దీంతో అసలు విషయం తెలిసింది."
- మిమీ చక్రవర్తి, టీఎంసీ ఎంపీ