Srilanka crisis: పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీంతో అక్కడి పరిస్థితుల పట్ల భారత్‌లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌లోనూ శ్రీలంక పరిస్థితులు తలెత్తుతాయా అని వస్తున్న అనుమానాలను కొట్టిపారేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు.
జైశంకర్ మాట్లాడుతూ..: శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్నామని, ఈ సంక్షోభం పొరుగుదేశంలో విపరీత పరిణామాలకు దారితీసిందని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితుల పట్ల చింతిస్తున్నట్లు తెలిపారు. అయితే, సామీప్యత కారణంగా ఆ దేశ పర్యావసానాలు సహజంగానే భారత్‌లోనూ ఆందోళనలు కలిగిస్తాయని పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో కొన్ని పోలికలు చూశామని 'భారతదేశంలో అలాంటి పరిస్థితి రావచ్చా?' అని కొంతమంది అడిగారన్నారు. దేశంలో సరిపడా నిధులు ఉన్నాయని, శ్రీలంక పరిస్థితులు రాబోవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.