దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు రకాల రాకెట్లను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO)శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ప్రయోగ వేదిక వద్ద ఈ పరీక్షలు జరిగాయి.
పినాక మెరుగైన వెర్షన్..
పినాక రాకెట్‌కు సంబంధించిన మెరుగైన వెర్షన్‌ను.. భిన్న లక్ష్యాలపై శరపరంపరగా ప్రయోగించారు. గురు, శుక్రవారాల్లో మొత్తం 25 'ఎన్‌హెన్స్‌డ్ పినాక'లను పరీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ రాకెట్ల పరిధిని పెంచటం వల్ల 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని అవి సొంతం చేసుకున్నాయని పేర్కొన్నాయి.
అలాగే 122 ఎంఎం క్యాలిబర్ రాకెట్‌కు సంబంధించిన మెరుగైన వెర్షన్లను శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భాగంగా బహుళ ప్రయోగ లాంచర్ నుంచి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. పినాక, 122 ఎంఎం రాకెట్ల గమనాన్ని టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలతో పరిశీలించారు. ప్రయోగ లక్ష్యాలన్నీ నెరవేరాయని అధికారులు తెలిపారు. ఈ రాకెట్లను పుణెలో డీఆర్డీఓకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏఆర్డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(హెచ్ఈఎంఆర్ఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 122 ఎంఎం రాకెట్లను భారత సైన్యం కోసం రూపొందించారు.
అవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి :ఆ ఫ్రెండ్స్ కోసం రాష్ట్రపతి రైలు ప్రయాణం