Delhi excise policy case: దిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో తనపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా. తాను దేశం విడిచి వెళ్లకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని శనివారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేసు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ తర్వాత లుక్‌ఔట్ నోటీసులు జారీపై సిసోదియా ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
లుక్‌ఔట్ జారీ చేయలేదన్న సీబీఐ: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా లుక్‌ఔట్ నోటీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఇప్పటి వరకు తాము ఎలాంటి లుక్‌ఔట్ నోటీసులు జారీచేయలేదని స్పష్టం చేసింది. నోటీసుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని.. త్వరలోనే జారీ చేస్తామని సీబీఐ వెల్లడించింది.
సవాల్ విసిరిన సిసోదియా: లుక్‌ఔట్ నోటీసులపై సిసోదియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీబీఐ తనిఖీలన్నీ విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. తన ఇంట్లో ఒక్క పైసా కూడా లభించలేదని తెలిపారు. ఇప్పుడు తాను కనిపించడం లేదంటూ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ''ఇవేం నాటకాలు?'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఘాటుగా ప్రశ్నించారు. తాను దిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నానన్నారు. ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు.