ex judges letter CJI: భాజపా మాజీ అధికార ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆందోళనకారుల అక్రమ నిర్బంధాలు, కూల్చివేతలను సుమోటో స్వీకరించాలని విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఓ లేఖ రాశారు.
ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు, యూపీ అధికార యంత్రాంగం చేపట్టిన అణిచివేత చర్యలకు సంబంధించి తాము రాసిన లేఖను అత్యవసర పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు యూపీ సహా దేశం నలుమూలల ఆందోళనలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖలో సంతకంచేసిన వారిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ ఏకే గంగూలీ, దిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, తమిళనాడు, కర్ణాటక హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చంద్రూ, జస్టిస్ మహమ్మద్ అన్వర్ ఉన్నారు. సీనియర్ న్యాయవాదులు శాంతి భూషణ్, ఇందిరా జైసింగ్,శ్రీరామ్ పంచు, ప్రశాంత్ భూషణ్, ఆనంద్ గ్రోవర్‌లు ఉన్నారు.
యూపీ పోలీసులు 300మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న యువకులను లాఠీలతో కొట్టడం, నిరసనకారుల ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం, మైనార్టీకి చెందిన నిరసనకారులను వెంబడించి కొట్టడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని లేఖలో తెలిపారు.