Naman Ojha Father Arrested: నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా తండ్రి వీకే ఓజాను(68) సోమవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వీకే ఓజాను అరెస్టు చేసినట్లు ముల్తాయ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులందరినీ ముందుగా అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు తర్వాత, వీకే ఓజాను సోమవారం స్థానిక కోర్టు ముందు హాజరుపరచగా, అతడ్ని ఒకరోజు పోలీసు కస్టడీకి పంపారు. ప్రసుత్తం పోలీసులు ఓజాను ప్రశ్నిస్తున్నారు.
ఏంటి ఈ కేసు?.. 2013లో బేతుల్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జౌల్‌ఖెడా బ్రాంచ్‌లో వీకే ఓజా మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన మోసానికి సంబంధించినది ఈ కేసు. 2014లో ముల్తాయ్ పట్టణంలోని పోలీసులు సుమారు రూ.1.25 కోట్ల అపహరణ చేశారనే ఆరోపణలపై వీకే ఓజాపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రాంచ్‌లో 34 నకిలీ ఖాతాలను తెరిచి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణ మొత్తాన్ని బదిలీ చేశారనే ఆరోపణలపై అప్పటి బ్యాంక్ మేనేజర్ రితేష్ చతుర్వేది చేసిన ఫిర్యాదు మేరకు జూన్ 19, 2014న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అనంతరం ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. పరారీలో ఉన్న వీకే ఓజా ఎట్టకేలకు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.