తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యాయవ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి.. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి' - ఎన్​వీ రమణ న్యూస్

వ్యవస్థ ఏదైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిందేనని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి రమణ అభిప్రాయపడ్డారు. విశ్వాసాన్ని కోల్పోతే వాటికి సమాజంలో స్థానం ఉండదన్న ఆయన.. అందుకు న్యాయవ్యవస్థ కూడా అతీతం కాదని చెప్పారు.

CJI RAMANA
CJI RAMANA

By

Published : Sep 5, 2022, 6:40 AM IST

న్యాయస్థానాలు నిరాడంబరంగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యల్ని తీసుకోవాలన్నారు. కొందరు మాత్రం కోర్టులు ప్రతిపక్షాల పాత్ర పోషించాలనో.. లేదంటే వాటికి అండగా నిలవాలనో కోరుకుంటున్నారని చెప్పారు. అదే జరిగితే కోర్టుల ఔచిత్యం, వాటి రాజ్యాంగ పరిధిపై విస్తృత ప్రశ్నలు తలెత్తుతాయన్నారు. 'కేపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ' ఆధ్వర్యంలో ఆదివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ అవార్డును ఆయన స్వీకరించారు. ఆ సంస్థ వార్షిక ఉపన్యాస కార్యక్రమంలో మాట్లాడారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ఈ సొసైటీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

"ప్రజాప్రయోజన వ్యాజ్యాల విధానాన్ని సుప్రీంకోర్టే ఆవిష్కరించింది. అది ప్రజలను న్యాయస్థానాలకు మరింత దగ్గర చేసింది. అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతున్నంత మాత్రాన ఆ సానుకూల ప్రయోగాన్ని కోర్టులు పక్కనపెట్టాలా? అన్న ప్రశ్నా ఉదయిస్తోంది. ఏ వ్యవస్థ అయినా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిందే. దానిని కోల్పోతే వాటికి సమాజంలో స్థానం ఉండదు. అందుకు న్యాయవ్యవస్థ కూడా అతీతం కాదన్నది నా అభిప్రాయం" అని జస్టిస్‌ రమణ చెప్పారు.

70 ఏళ్లనాటి సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి
"మనల్ని 70 ఏళ్ల క్రితం ప్రభావితం చేసిన సమస్యలు ఇప్పటికీ ఉన్నాయన్నది గుర్తించాలి. ఒకవైపు ఆకాశహర్మ్యాలు, మరోవైపు మురికివాడల్లో పూరిగుడిసెల్లో మగ్గుతూ ఆకలితో అలమటిస్తున్న పిల్లలు కనిపిస్తారు. చంద్రుడు, అంగారకుడిపై కాలు మోపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మనం.. వీధులు, మురికివాడలు, కుగ్రామాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను విస్మరించకూడదు. అన్ని రంగాల్లో మాదిరే న్యాయవ్యవస్థకు, ప్రజాస్వామ్యానికీ భిన్నాభిప్రాయాలు, కోణాలు ముఖ్యమే.

ఎన్నో తీర్పుల పునఃసమీక్ష
"సుప్రీంకోర్టు ఎన్నో నిర్ణయాలను పునఃసమీక్షించి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఎన్నో తప్పులను సరిదిద్దింది" అని జస్టిస్‌ రమణ తెలిపారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ- 22 ఏళ్లుగా సేవలందించే అవకాశమిచ్చిన 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజలకు తన పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

సతీశ్‌రెడ్డికి అబ్దుల్‌ కలాం పురస్కారం
'ఏపీజే అబ్దుల్‌కలాం జాతీయ పురస్కారా'న్ని డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌, రక్షణ మంత్రి శాస్త్ర-సాంకేతిక సలహాదారుడు జి.సతీశ్‌రెడ్డికి ప్రకటించారు. ఆయన తరఫు ప్రతినిధి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

వారికి అంకితం
దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఏకైక రాష్ట్రం తమదేనని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. వ్యవసాయదారులను రాష్ట్రానికి వెన్నెముకగా అభివర్ణిస్తూ.. వారి కష్టానికి ఫలితంగా నాలుగుసార్లు కృషి కర్మణ్‌ అవార్డులు లభించాయని గుర్తుచేశారు. విలక్షణ, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలకు గుర్తింపుగా పట్నాయక్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ 'జీవన సాఫల్య పురస్కారం' అందుకున్న ఆయన.. గత 22 ఏళ్లుగా తనను ఆశీర్వదిస్తున్న 4.5 కోట్ల మంది ఒడిశావాసులకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details