EVM tampering: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 14న ముగిసింది. మార్చి 10న ఓట్ల లెక్కింపు. అప్పటివరకు ఈవీఎంలను భద్రపరిచేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అయితే, ఆ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారనే భయం కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ సైతం ఈవీఎంలను భాజపా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ కారణంగా రాష్ట్రంలోని ఖటిమా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి.. ఏకంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద తమ కార్యకర్తలను కాపలాగా పెట్టారు.
ఆయన గెలుపు కోసం..
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ కాపడీ.. ఖటిమా నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీపై పోటీ చేశారు. ధామీ గెలుపు కోసం భాజపా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు భువన్. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపుర్ బగవాఢా మండిలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద రాత్రింబవళ్లు కార్యకర్తలను కాపలాగా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ముందు ఓ టెంటు ఏర్పాటు చేసుకుని ముగ్గురు కార్యకర్తలు.. మూడు షిఫ్టుల ప్రకారం పహారా కాస్తున్నారు.
ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 1488 ఈవీఎంలను రుద్రపుర్లో భద్రపరిచారు అధికారులు. మూడంచెల భద్రత, సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ఈమేర భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ భయపడటం గమనార్హం.
ఇదీ చూడండి:మోదీ-యోగికి ప్రజా సమస్యలు పట్టవు: సోనియా