అఫ్గాన్‌లో సంక్షోభం(Afghanistan crisis) నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. మంగళవారం మరో 78 మందిని దిల్లీకి తీసుకొచ్చింది. వీరిలో 25మంది భారతీయులు కాగా.. 44 మంది అఫ్గాన్ సిక్కులు, మిగతావారు అఫ్గాన్ హిందువులు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీరందరిని సోమవారం కాబుల్ నుంచి తజికిస్థాన్ రాజధాని దుశాంబేకు యుద్ధ విమానంలో తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం ఉదయం దిల్లీకి తీసుకొచ్చారు.
భారత్‌కు వచ్చిన ఈ బృందంలోని వారు సిక్కుల పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ మూడు ప్రతులను తీసుకొచ్చారు. దిల్లీలోని ఇంధిరా గాంధీ విమానాశ్రయంలో వీరికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్వాగతం పలికారు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులను కలిగి ఉండటం గర్వకారణమని ఆయన ట్వీట్ చేశారు. ఓ ప్రతిని ఆయన స్వయంగా మోసుకుంటూ తీసుకెళ్లారు. వీటిని దిల్లీలోని న్యూ మహవీర్ నగర్లో ఉన్న గురు అర్జన్ దేవ్ జీ గురుద్వారాలో భద్రపరచనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
అఫ్గాన్‌లో ఇంకా 200 మంది సిక్కులు, హిందువులు ఉన్నారని, వీరంతా కాబుల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో 75 మందిని భారత్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.