కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు అనంతర పరిస్థితులను తెలుసుకునేందుకు.. 24 దేశాలకు చెందిన రాయబారుల బృందం అక్కడ పర్యటించింది. ఈ మేరకు దాల్ సరస్సు కన్వెన్షన్ హాల్లో సంగీత కళాకారులు, రచయితలతో సమావేశమై.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత బుద్గాం జిల్లాలోని మాగామ్ను సందర్శించిన అధికారులు.. స్థానిక పాలనా యంత్రాంగం ప్రతివారం నిర్వహించే 'బ్లాక్ దివస్'ను పరిశీలించారని అధికారిక వర్గాలు తెలిపాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర అధికారులు, రాజకీయ నాయకులు వీరితో పాటు ఉన్నారు.
హజ్రత్బల్ సందర్శన..
అనంతరం.. శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్‌ను సందర్శించిన రాయబారులు ఆ మసీదు చారిత్రక ప్రాముఖ్యత గురించి అక్కడి కళాకారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జునైద్ మట్టు తెలిపారు. అక్కడి పరిస్థితులు, స్వేచ్ఛా వాతావరణంలో జరిగిన ఎన్నికల(డీడీసీ)ను గురించి స్థానికులు అధికారులకు వివరించినట్టు జునైద్ చెప్పారు.