నకిలీ ఓటర్ల జాబితాపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కేరళ హైకోర్టు కోరింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఒక ఓటరు ఒక్కసారి మాత్రమే ఓటు వేసేలా చూడాలంటూ ఎన్నికల సంఘానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని నకిలీ ఓట్ల అంశంపై ఉన్నత న్యాయస్థానం తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై కేరళ ప్రధాన ఎన్నికల అధికారి కోర్టు ఎదుట హాజరయ్యారు. సమస్యను పరిశీలిస్తున్నామని.. సోమవారం సాయంత్రం నాటికి స్పష్టత వస్తుందని వివరణ ఇచ్చారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు.
4 లక్షల నకిలీ ఓట్లు!
రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని.. ఒకే పేరుతో వివిధ చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారికి ఐదుసార్లు ఫిర్యాదు చేసినట్లు రమేశ్ చెన్నితాల తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు పలు నియోజకవర్గాలకు సంబంధించి నకిలీ ఓట్ల వివరాలను పొందుపరిచారు. ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు కార్డులు కలిగి ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతించొద్దని కోరారు. నకిలీ గుర్తింపు కార్డుల జారీలో హస్తం ఉన్న ప్రభుత్వాధికారులను ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షించాల్సిందిగా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
140 మంది శాసనసభ్యులున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి:'భాజపా రాజకీయాలు కేరళలో పనిచేయవు'
కేరళ రాజకీయం.. వివాదాల మయం