మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినులు ఓ వినూత్న పరికరం తయారు చేశారు. అనుకోని ఆపద వచ్చినప్పుడు మనకు కావాల్సిన వాళ్లకు సమాచారం చేరవేయడమే కాకుండా.. దుండగులను ఎదుర్కొనేలా ఈ డివైజ్‌ను రూపొందించారు. ఈ పరికరం.. చేతికి బ్రేస్లెట్ లేదా ఉంగరంలా ధరించేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పుర్ జిల్లాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న స్నేహ, అక్షిత ఈ పరికరాన్ని తయారుచేశారు. దీన్ని లాగేందుకు ప్రయత్నం చేసినప్పుడు అందులోంచి కరెంట్ విడుదలై షాక్ కొట్టేలా బ్యాటరీని ఏర్పాటు చేశారు.
ఈ డివైజ్ ఫోన్ ద్వారా ఉమెన్ సేఫ్టీ యాప్‌కు అనుసంధానమై ఉంటుంది. మరో ఐదు నంబర్లకు కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదం ఎదురైనప్పుడు పరికరంలోని బటన్‌ను రెండు సార్లు నొక్కాలి. వెంటనే ఆ నంబర్లకు కాల్‌తో సహా ఒక మెసేజ్ వెళుతుంది. ప్రస్తుతం ఉన్న లొకేషన్ సైతం షేర్ అవుతుంది. దీంతో వారు ఘటన స్థలానికి త్వరగా చేరుకోవచ్చు.