Encounter In Rajouri Today :జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య రెండో రోజూ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. IED నిపుణుడు, స్నైపర్ అయిన పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాదిని మొదట మట్టుబెట్టినట్లు రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. డంగ్రీ, కండీ దాడుల్లో అతడే కీలక సూత్రధారని అనుమానిస్తున్నారు. కాసేపటికే మరో ముష్కరుడు బలగాల కాల్పుల్లో హతమయ్యాడు. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో జవాను అమరుడయ్యాడు. దీంతో ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 5కు చేరింది.
రాజౌరీ జిల్లాలోని బజిమాల్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో.. నలుగురు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి నుంచి ఆ ప్రాంతాన్ని దిగ్భంధించిన సాయుధ బలగాలు నిర్భంధ తనిఖీ చేపట్టాయి. ఈ ఉదయం నుంచి ముష్కరుల వేట ప్రారంభించిన భద్రతా బలగాలు ఇద్దరిని మట్టుబెట్టాయి. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో.. ముష్కరులు తప్పించుకోకుండా రాత్రంతా జాగ్రత్తలు తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
'మృతుల్లో ఒకరిని ఐఈడీ నిపుణుడైన ఖువారీగా గుర్తించాం. అతడు పాకిస్థాన్, అఫ్గాన్ ఫ్రంట్‌లో శిక్షణ తీసుకున్నాడు. లష్కరే తొయిబాలో కీలక ర్యాంకు కలిగిన ఉగ్రవాది అతడు. ఏడాది కాలంగా తన బృందంతో రాజౌరీ- పూంచ్ ప్రాంతంలో ఖువారీ క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. డాంగ్రీ, కండీ దాడుల మాస్టర్‌మైండ్ కూడా అతడే అని అనుమానిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకే అతడిని ఇక్కడికి పంపించారు' అని రక్షణశాఖ ప్రతినిధి వివరించారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో డంగ్రీలో పలువురు పౌరులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగాయి.