తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటిషర్లపై బాంబు వేసిన 'బోస్​'కు నోటీసులు.. 'రూ.లక్ష చెల్లించకపోతే కరెంట్ కట్!' - బిహార్ తాజా వార్తలు

దేశం కోసం పోరాడి ప్రాణాలను కోల్పోయిన ఖుదీరామ్​ బోస్​కు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు పంపించారు. రూ.లక్షకు పైగా విద్యుత్​ బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు బిల్లు కట్టాలని నోటీసులు పంపించడం ఏంటని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

electricity department issued notice to martyr khudiram bose in muzaffarpur bihar
ఖుదీరామ్ బోస్​కు విద్యుత్ బకాయి చెల్లించమని నోటీసులు పంపిన విద్యుత్ శాఖ

By

Published : Feb 22, 2023, 3:04 PM IST

బ్రిటిషర్లపై బాంబు విసిరిన స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్​కు బిహార్ విద్యుత్ శాఖ నోటీసులు పంపించింది. రూ.లక్షా 36వేల బిల్లు కట్టాలని నోటీసులో పేర్కొంది. వారం రోజుల్లోగా కరెంటు బిల్లును కట్టాలని.. లేదంటే విద్యుత్​ను నిలిపేస్తామని నోటీసులు పంపించారు. దీంతో అక్కడి ప్రజలు విద్యుత్​ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ.లక్ష 36వేల బిల్లు
ముజఫర్​పుర్ కంపెనీ బాగ్‌ ప్రాంతంలో ఖుదీరామ్​, ప్రఫుల్ చంద్ర చాకీల స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఈ మెమోరియల్‌కు నార్త్ బిహార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ స్మారక చిహ్నాన్ని పరిరక్షిస్తున్న ఏజెన్సీ.. కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో కరెంట్ కొండలా పేరుకుపోయింది. ప్రస్తుతం ఆ బిల్లు రూ.1,36,943కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే బిల్లు చెల్లించాలని ఏకంగా ఖుదీరామ్ బోస్ పేరు మీద నోటీసు పంపారు విద్యుత్ శాఖ అధికారులు.

విద్యుత్​శాఖ పంపించిన నోటీసు

ప్రజల ఆగ్రహం
అయితే, దేశం కోసం పోరాడిన అమరవీరులకు కరెంట్ బిల్లు నోటీసులు పంపడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఖుదీరామ్ బోస్ పేరు మీద నోటీసులు పంపిన విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మెమోరియల్​కు విద్యుత్ కనెక్షన్ నిలిపివేస్తే తామంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. సాఫ్ట్​వేర్ లోపం వల్ల ఇలా జరిగిందని సర్ది చెప్పారు.

"ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఖుదీరామ్ బోస్ మెమోరియల్ పార్క్ నిర్వహణ బాధ్యత సహారాపై ఉంది. వారే కరెంటు బిల్లును చెల్లిస్తున్నారు. కంప్యూటర్​ సాఫ్ట్​వేర్​లో ఖుదీరామ్​ బోస్​ పేరు మీద కరెంటు బిల్లు నమోదు అయ్యింది. అందుకే బకాయి చెల్లించాలని నోటీసులు ఆయన పేరు మీద వచ్చాయి. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాము. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం."
-జ్ఞాన్ ప్రకాశ్, ఎస్‌డీఎం, తూర్పు ముజఫర్‌పుర్

బ్రిటిషర్లపై బాంబు వేసిన బోస్
ఖుదీరామ్ బోస్ భారతదేశంలోని బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన బంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన భారతీయ విప్లవకారుడు. ప్రఫుల్ చంద్ర చాకీతో కలిసి అప్పటి బ్రిటీష్ న్యాయమూర్తి, మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ను చంపడానికి ప్రయత్నించారు. కింగ్స్​ఫోర్డ్ ఉన్న వాహనంపై బాంబులు విసిరి చంపడానికి ప్రయత్నించారు. అయితే మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్ వేరే వాహనంలో కూర్చున్నారు. ఆ దాడిలో ఇద్దరు బ్రిటిష్ మహిళలు మరణించారు. వీరిని అరెస్టు చేయడానికి ముందే ప్రఫుల్ల తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 1908, ఆగస్టు 11న ఖుదీరామ్ బోస్‌ను బ్రిటిషర్లు ఉరితీశారు. ఉరితీసే సమయానికి ఖుదీరామ్ వయస్సు 18 సంవత్సరాలే. ఖుదీరామ్, ప్రఫుల్ల జ్ఞాపకార్థం ఇద్దరి స్మారకాన్ని ముజఫర్‌పుర్ కంపెనీ బాగ్‌లో నిర్మించారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సింగ్ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details