ఒడిశా కొరాపుట్‌లో దారుణం జరిగింది. ఇంటి పైకప్పు విషయంలో చెలరేగిన గొడవ ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. వృద్ధుడి పట్ల కుటుంబ సభ్యులు అమానవీయంగా ప్రవర్తించారు. కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. దీంతో కుర్షా మనియక అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లక్ష్మీపుర్ బ్లాక్ ఉపరకుతింగ గ్రామంలో జరిగింది.
అసలేం జరిగిందంటే: మనియక.. తన సోదరుడు, కుమారుడు, కోడలితో ఇంటి పైకప్పు విషయంలో శుక్రవారం గొడవపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు మనియకను కరెంట్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. గిలగిలా కొట్టుకుంటూనే వృద్ధుడు కన్నుమూశాడు.
అనంతరం గ్రామస్థుల సహకారంతో నిందితులు మనియక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధుడిని చితకబాదిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరిని లక్ష్మీపుర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.