తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం నయా ప్లాన్​.. కొత్తగా 8 సిటీలు ఏర్పాటు.. జనాభా భారాన్ని తగ్గించడమే టార్గెట్​! - bharat new eight cities

India New Cities : దేశంలో కొత్తగా మరో ఎనిమిది నగరాలు ఏర్పాటు కానున్నాయి! పట్టణ కేంద్రాలపై జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక కేంద్రం పరిశీలనలో ఉందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

eight-new-cities-in-india
eight-new-cities-in-india

By

Published : May 18, 2023, 6:05 PM IST

Eight New Cities In India : మన దేశంలో ఎన్ని నగరాలు ఉన్నాయో మీకు తెలుసా?.. సుమారు నాలుగు వేలకుపైగా ఉంటాయి! అయితే త్వరలో మరో ఎనిమిది నగరాలు పెరగనున్నాయి. అదేంటి అని ఆలోచిస్తున్నారా?
దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. పట్టణ కేంద్రాలపై నానాటికీ పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.

'ఎనిమిది నగరాల ఏర్పాట్లకు పరిశీలన'
మధ్యప్రదేశ్​ ఇందౌర్​లో గురువారం 'అర్బన్​ 20' సమావేశం తర్వాత కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్​ డైరెక్టర్​ ఎంబీ సింగ్​ మీడియాతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు. "ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు తర్వాత.. పలు రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ఆ తర్వాత ఎనిమిది కొత్త నగరాల ఏర్పాటుకు అధికారులు పరిశీలిస్తున్నారు" అని ఎంబీ సింగ్​ చెప్పారు.

'కొత్త నగరాలను అభివృద్ధి చేస్తే..'
కొత్త నగరాల ఏర్పాటుకు చెందిన పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని ఎంబీ సింగ్​ తెలిపారు. "ప్రస్తుత నగరాలు.. పౌరుల అవసరాలను తీర్చలేకపోతున్నందున దేశంలో కొత్త సిటీలను నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న నగరాలు శివార్ల వరకు అస్తవ్యస్తంగా విస్తరించడం వల్ల ఆయా నగరాల ప్రాథమిక ప్రణాళికలు ప్రభావితమవుతున్నాయి. కొత్తగా ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తే ఆ చుట్టూ కనీసం 200 కిలోమీటర్ల పరిధిలో సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు మెరగవుతాయి. కొత్త సిటీల ఏర్పాటుకు సంబంధించిన రోడ్‌మ్యాప్ ఖరారు కానప్పటికీ.. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది" అని సింగ్ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్​
గత నెలలో జనాభా అధికంగా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాను.. భారత్‌ అధిగమించింది. 142 కోట్ల 86 లక్షల జనాభాతో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస ఏప్రిల్​ 18న విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచింది.

భారత్​ కన్నా 29 లక్షల మంది తక్కువ!
జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్-2023 పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌ నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో కల్లా భారత్‌లోనే అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు ప్రకటించింది. భారత్​తో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది జనాభా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్చేయండి.

ABOUT THE AUTHOR

...view details