ఝార్ఖండ్ ఓ నవజాత శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఆపరేషన్లో 21 రోజుల పసికందు కడుపులో నుంచి ఎనిమిది పిండాలను తొలగించారు వైద్యులు. ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారి అని తెలిపారు.
రాంచీలోని రామ్‌ఘర్‌లో అక్టోబర్ 10న జన్మించిన ఓ బాలికకు కడుపునొప్పి వచ్చిందని కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బిడ్డ కడుపులో కణితులు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు సీటీ స్కాన్ చేశారు. 21 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత నవంబర్ 1న ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద పాపకు ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ సమయంలో కడుపులో ఉన్నవి కణితలు కాదని, పిండాలు అని నిర్ధరణకాగా.. వారు షాక్కు గురయ్యారు. అలా ఎనిమిది అభివృద్ధి చెందని పిండాలను తొలగించారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఫీటస్-ఇన్-ఫీటూ కేసులు 100 కంటే తక్కువ ఉంటాయని వైద్యులు చెప్పారు. అయితే.. ఆయా కేసుల్లో కడుపు నుంచి ఒక పిండాన్ని మాత్రమే తొలగించారు. ఇలాంటి కేసు బహుశా ప్రపంచంలోనే మొదటిది అయ్యుండచ్చని పాపకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు పేర్కొన్నారు.