తెలంగాణ

telangana

'విపక్ష నేతలపై రాజకీయ వేధింపులు.. 2024 ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తథ్యం'

By

Published : Jun 14, 2023, 1:15 PM IST

Updated : Jun 14, 2023, 5:37 PM IST

ED raids Senthil Balaji : తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి గుణపాఠం చెబుతారని సీఎం ఎంకే స్టాలిన్​ ఘాటుగా విమర్శించారు. విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు నేపథ్యంలో ఇతర విపక్ష నేతలూ కేంద్రంపై మండిపడ్డారు. బీజేపీ నేతలు వీరిపై ఎదురుదాడి చేస్తున్నారు.

ED Raids on TN Minister  People will teach BJP lesson in 2024 says Tamil Nadu CM Stalin
stalin warns bjp

ED raids Senthil Balaji : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెబుతారని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన వెంటనే అస్వస్థతకు గురై, చెన్నై ఒమండూర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు విద్యుత్​శాఖ మంత్రి వి.సెంథిల్​ బాలాజీని స్టాలిన్ బుధవారం ఉదయం​ పరామర్శించారు. తమ నాయకులపై జరుగుతున్న దాడులపై న్యాయపరమైన పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఉద్యోగాల కుంభకోణం కేసులో మనీలాండరింగ్​ ఆరోపణలకు సంబంధించి మంత్రి సెంథిల్​ బాలాజీని ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తరువాత మంగళవారం అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను చెన్నై ఒమండూర్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బైపాస్​ సర్జరీ చేయాలి!
మంత్రి సెంథిల్​ బాలాజీకి కరోనరీ యాంజియోగ్రామ్​ నిర్వహించారు. ఆయనకు వీలైనంత త్వరగా బైపాస్​ సర్జరీ చేస్తే మంచిదని తమిళనాడు ప్రభుత్వ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

నా భర్తను చూపించండి: మేఘల
మనీలాండరింగ్​ కేసులో తన భర్త సెంథిల్​ బాలాజీని ఈడీ అరెస్టు చేయడాన్ని ఆయన భార్య ఎస్​. మేఘల తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మద్రాస్​ హైకోర్టులో హెబియస్​ కార్పస్​ పిటిషన్​ను కూడా ఆమె దాఖలు చేశారు.

రాజకీయ వేధింపులు, బెదిరింపులకు బెదరం!
సెంథిల్​ బాలాజీని ఈడీ అరెస్టు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం విపక్ష పార్టీల నేతలపై రాజకీయ బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు విపక్షాలు ఎన్నటికీ భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

రాజ్యాంగ విరుద్ధం
మంత్రి సెంథిల్​ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని, ఇది పూర్తిగా అన్యాయమని డీఎంకే ఎంపీ ఇలాంగో తీవ్రంగా విమర్శించారు.
"బీజేపీ తనను వ్యతిరేకించే విపక్ష నేతలపై దాడులు చేయడం సాధారణమైపోయింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నా" అని ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు.

బాధితులమని చెప్పుకోవడం ఏమిటి?
బీజేపీ ప్రభుత్వం బ్యాక్​డోర్​ బెదిరింపులకు పాల్పడుతోందని డీఎంకే అధినేత స్టాలిన్​ చేసిన విమర్శలను, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తిప్పికొట్టారు. తప్పు చేయడమే కాకుండా.. తిరిగి బాధితులమని చెప్పుకోవడం ఏమిటని ఎద్దేవా చేశారు.

విద్యుత్​ శాఖ మంత్రి సెంథిల్​ బాలాజీ అస్వస్థతగా ఉందని ఆసుపత్రిలో చేరడం 'పూర్తిగా ఓ నాటకం' అని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణ్​ త్రిపాఠి తీవ్రంగా విమర్శించారు. డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్న మంత్రి ఇప్పుడు ఆసుపత్రిలో చేరి నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. చట్టం నుంచి మంత్రి తప్పించుకోలేరని పేర్కొన్నారు.

సెంథిల్​ రాజీనామా చేయాలి!
మంత్రి సెంథిల్ బాలాజీ​ ఆసుపత్రిలో చేరడాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు. ఏఐఏడిఎంకే నేత, మాజీ మంత్రి జయకుమార్​ 20 రోజులపాటు జైలులో ఉన్నారని, ఆ సమయంలో కనీసం ఆయనకు మందులు కూడా వేసుకోవడానికి ఇవ్వలేదని గుర్తుచేశారు. సెంథిల్​ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పళనిస్వామి డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 14, 2023, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details