ED Raids AAP MP :దిల్లీ మద్యం పాలసీకుంభకోణం కేసులో ఈడీ (ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు చేపట్టింది. ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎంపీ నివాసంతో పాటు ఆయనతో దగ్గరి సంబంధాలున్న స్టాఫ్ మెంబర్లను కూడా ఈ కేసు విషయంలో ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సోదాలను ఆప్ జాతీయ ప్రతినిధి రీనా గుప్తా ఖండించారు. "ప్రధాని నరేంద్రమోదీ-వ్యాపారవేత్త అదానీ.. విషయంపై సంజయ్ సింగ్ తరచూ ప్రశ్నిస్తున్నందుకే ఆయణ్ను లక్ష్యంగా చేసుకొని.. నివాసంపై ఈడీ సోదాలు జరుపుతోంది. ఇప్పటికి ఇంట్లో ఏమీ దొరకలేదు. రోజంతా వెతికినా.. ఎమీ కనిపెట్టలేరు. నిన్న (మంగళవారం) కొందమంది జర్నలిస్టులపై కూడా సోదాలు ఈడీ సోదాలు జరిపింది" అని ఆమె ధ్వజమెత్తారు.
మరోవైపు, ఎంపీ నివాసంలో రైడ్ జరుగుతున్న తరుణంలో సంజయ్ సింగ్ తండ్రి మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు ఉదయం సుమారు 7.30 ప్రాంతంలో వచ్చారు. అధికారులు వారి పని వారు చేస్తున్నారు. వారు రాగానే చెప్పాను అర్ధరాత్రి దాకా అయినా సోదాలు చేసుకోవచ్చని చెప్పా. మేము పూర్తిగా వారితో సహకరిస్తున్నాం. వారు మళ్లీ మళ్లీ మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదు. ఈ కేసులో క్లీన్చిట్ వచ్చేంతవరకూ ఎదురు చూస్తాం" అని ఎంపీ తండ్రి పేర్కొన్నారు.