TSPSC ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. నేటి నుంచి ఈడీ విచారణ షురూ ED Investigation in TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. కమిషన్‌లో పరీక్షల వ్యవహారాలను పర్యవేక్షించే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్‌ఛార్జి శంకరలక్ష్మి లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ అధికారి సత్యనారాయణకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు, రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్ సహా కార్యదర్శి సభ్యులను ప్రశ్నించారు. అయితే వారందర్నీ ఈడీ మరోసారి విచారించనుంది.
TSPSC Paper Leak Case : రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వాంగ్మూలాల నమోదుకు అనుమతివ్వాలంటూ.. నాంపల్లిలోని కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతిస్తే ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌ని విచారించి, ఆ తర్వాత ఇదే కేసులో అరెస్టయిన మిగతా 14 మందిని ప్రశ్నించనుంది. దర్యాప్తు కోసం అవసరమైన పత్రాలను సిట్ నుంచి సేకరించాలని ఈడీ భావిస్తోంది. ఇప్పటి వరకూ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాల వంటివి అందులో ఉంటాయి. ఒకవేళ వివరాలిచ్చేందుకు సిట్ నిరాకరిస్తే కోర్టు ద్వారా అయినా తెచ్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ED Investigation in TSPSC Case news: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఈడీ పరిధిలోకి రాదు. కానీ ఆ వ్యవహరంలో పెద్ద మొత్తంలో నిధుల మళ్లింపు జరిగిందన్న ఆనుమానంతో ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన ప్రవీణ్ పలువురికి విక్రయించాడు. తొలుత తన స్నేహితురాలు రేణుకకు మాత్రమే విక్రయించినట్లు అతడు చెప్పినా.. సిట్ దర్యాప్తులో మరికొందరికి అమ్మినట్లు తేలింది. ప్రవీణ్ వద్ద ప్రశ్నపత్రాలు పొందినవారు ఇంకొందరికి అమ్మినట్లు వెల్లడైంది. విదేశాల్లో ఉన్నవారు వచ్చి పరీక్షలు రాసినట్లు నిర్ధారణ అయింది.
ఆ డబ్బంతా ఏమైంది?: ఆ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం కనీసం రూ.40 లక్షలు చేతులు మారి ఉండవచ్చని సిట్ భావిస్తోంది. నిందితులు, అనుమానితుల బ్యాంకు లావాదేవీల్లో అందుకు సంబంధించి ఆధారాలు పెద్దగా లభించలేదు. ఆ డబ్బంతా ఏమైందన్నది అసలు ప్రశ్నగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాల్లో వివాదాలు నడుస్తున్న తరుణంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: