ED Inquiry in TSPSC Paper Leakage case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను కోర్టు అనుమతితో చంచల్‌గూడ జైలులో రెండు రోజుల పాటు విచారించింది. ఇటీవల కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర్‌లక్ష్మీ, ఏఎస్‌ఓ అడ్మిన్ సత్యనారాయణను ఈడీ తన కార్యాలయంలో ప్రశ్నించింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు.
TSPSC Paper Leakage case Update: వారం రోజుల కిందట విచారణకు హాజరుకావాల్సిందిగా వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఛైర్మన్, కార్యదర్శి బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. రాత్రి 11 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. సుమారు 12 గంటల పాటు ఇద్దరిని ఈడీ విచారించింది. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ని గంటల పాటు విచారించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్సియల్ సెక్షన్ నుంచి పేపర్ లీక్ అయిన అంశాన్ని ఈడీ అధికారులు వారిని అడిగినట్లు సమాచారం.
TSPSC పేపర్ లీక్ కేసు.. వారి ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించిన ఈడీ: సెక్షన్‌లో పని చేసే అధికారులు, సిబ్బంది, కార్యదర్శి పీఏగా ఉన్న ప్రవీణ్ కుమార్ల వ్యవహారంపై ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన తర్వాత వాటిని ఎవరెవరికి విక్రయించారు? వాటి ద్వారా ఎంత లబ్ధి పొందారనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అసలు టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహించేందుకు ఎలాంటి ప్రక్రియ అమలు చేస్తున్నారని ఛైర్మన్ సహా కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించిన ఈడీ అధికారులు వారి స్టేట్మెంట్స్ను రికార్డు చేశారు.