ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లు హ్యాకింగ్‌కు గురవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఎన్నికల కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందుకు సంబంధించి ఈసీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ఈ చర్య చేపట్టినట్టు వెల్లడించింది. దర్యాప్తు ప్రారంభమైందని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
"సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త 2017 డిసెంబరు 21వ తేదీకి చెందినది. ఈవీఎంలు హ్యాక్ అవుతాయంటూ ఈ నకిలీ వార్తలు పేర్కొంటున్నాయి. ఇందులో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి గురించి కూడా ప్రస్తావించారు. ఫలానా పార్టీ ఈవీఎంలు హ్యాక్ చేయడం ద్వారా ఎన్నికలు గెలిచిందని కృష్ణమూర్తి పేర్కొంటున్నట్టు తప్పుడు సమాచారం ఇస్తోంది. 2018లో ఈ నకిలీ వార్తలు కృష్ణమూర్తి దృష్టికి రాగా.. ఆయన వీటిని ఖండించారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి ఈ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడం గమనార్హం."
-ఎన్నికల కమిషన్