Duronto Express collided with a Bolero vehicle: తెల్లవారుజామున 2.30 గంటలు.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్.. రైలు వేగంగా దూసుకుపోతుంది.. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు దగ్గరకు రాగానే ఒక్కసారిగా భారీ శబ్ధం.. ఏమైందోనని ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేశారు. తీరా లేచి చూసేసరికి.. ట్రైన్ ఢీకొని ఓ వాహనం తుక్కుతుక్కైంది. ఈ ఘటనతో రైలు 5 గంటలుగా నిలిచిపోయింది.
అసలు పట్టాల పైకి బొలెరో వాహనం ఎలా వచ్చింది?: కొంతమంది గేదెలను దొంగతనం చేయడానికి వ్యూహం రచించారు. ఆ వ్యూహాన్ని అమలుపరచడానికి రాత్రి సమయం అయితే ఎవరికీ దొరకకుండా తప్పించుకోవచ్చని అనుకున్నారు. అనుకున్నట్టుగానే గేదెల దొంగతనానికి బొలెరో వాహనంలో బయలుదేరారు. వాళ్లు గేదెలను దొంగతనం చేసేలోపే వారి ఆలోచనలను పోలీసులు పసిగట్టినట్టున్నారు. పోలీసులను చూసిన దొంగలు.. వారి నుంచి తప్పించుకోవాలనుకున్నారు. బొలెరో వాహనంలో 100 కి.మీ స్పీడుతో దూసుకెళ్తున్నారు. అంతలో భీమడోలు దగ్గర రైల్వే గేటు వేసి ఉంది. ఎలాగైనా పోలీసుల నుంచి తప్పించుకోవాలని.. గేటును ఢీ కొట్టి తప్పించుకోవాలనుకున్నారు. దొంగలు రైల్వే గేటును ఢీకొట్టారు. కానీ వాహనం ఆగింది.. ఎంత స్టార్ట్ చేసినా కాలేదు. ఓ వైపు నుయ్యి, మరో వైపు గొయ్యి అన్నట్లుగా తయారయ్యింది వాళ్ల పరిస్థితి.. ఓ వైపు పోలీసులు, మరోవైపు వేగంతో దుసుకు వస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్.. ఏమీ చేయాలో అర్ధం కాలేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలను కాపాడుకోవడానికి వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లారు.