Drugs Parcel Cyber Crime in Hyderabad : హైదరాబాద్ నగరంలో సైబర్‌నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ.. కస్టమ్స్, సీబీఐ అధికారులమంటూ నమ్మించి ఏకంగా అప్పుచేయించి మరి.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటువంటి సైబర్ నేరాల్లో మోసపోతున్నవారిలో ఎక్కువగా చదువుకున్నవారే ఉండటం గమనార్హం.
Fake Customs officer call fraud in Hyderabad :నగరంలోని బండ్లగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని(31)కి జులై 26న అపరిచిత మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. స్మిత పేరుతో పరిచయం చేసుకున్న మహిళ.. మీ పేరిట మలేసియాకు పంపిన పార్సిల్ ముంబయికి తిరిగొచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తెలిపింది. ఆ డ్రగ్స్ పార్సిల్‌తో తనకు సంబంధం లేదని యువతి చెప్పినా వినలేదు. అనంతరం ముంబయి కస్టమ్స్ అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని గూగుల్ మీట్ ద్వారా లైన్ కలిపింది.
ముంబయి కస్టమ్స్ కమిషనర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ భయపెట్టిన నిందితుడు యువతి ఆధార్ కార్డు వివరాలు తీసుకున్నాడు. ఆధార్ ఐడీ పరిశీలించగా హవాలా లావాదేవీల కేసుతో సంబంధముందని.. బ్యాంకు లావాదేవీలు తనిఖీ చేస్తామంటూ అకౌంట్ నంబరు తీసుకున్నారు. అనంతరం సీబీఐ ఆఫీసర్ పేరిట మరో వ్యక్తి వీడియోకాల్‌లోకి వచ్చాడు. మీ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని.. మొత్తం కుటుంబం జైలు పాలు అవుతారని బెదిరించాడు.