భారత యుద్ధనౌకలను శత్రు క్షిపణుల బారి నుంచి రక్షించేందుకు.. ఆధునిక చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ తెలిపింది. ఆత్మనిర్భర భారత్ కింద డీఆర్డీఓకు అనుబంధంగా ఉండే జోధ్‌పుర్ రక్షణ పరిశోధనాశాల-డీఎల్‌జే.. మూడు రకాల చాఫ్ రాకెట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
స్వల్ప శ్రేణి చాఫ్ రాకెట్లు, మధ్యశ్రేణి చాఫ్ రాకేట్లు, ధీర్ఘశ్రేణి చాఫ్ రాకెట్లను.. అభివృద్ధి చేసినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. ఈ 3 రకాలను ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించగా సంతృప్తికర ఫలితాలను ఇచ్చినట్లు పేర్కొంది. యుద్ధనౌకలపై ప్రయోగించిన శత్రుక్షిపణులను.. చాఫ్ రాకెట్లు దారిమళ్లిస్తాయని డీఆర్డీఓ తెలిపింది. శత్రుదేశాల నుంచి రక్షించుకునేందుకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా బయట ఎక్కడా దొరకని ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధిచేసినట్లు వెల్లడించింది. వీటిని త్వరలోనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు వివరించింది.