DRDO test autonomous flight: ఆధునిక యుద్ధ తంత్రాలను దృష్టిలో పెట్టుకొని భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) దేశీయంగా అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మానవ రహిత యుద్ధ విమానాలపై పరిశోధనలు ప్రారంభించిన డీఆర్‌డీఓ తాజాగా అరుదైన ఘనత సాధించింది. స్వదేశీ పరిజ్ఞానమైన ఆటోనామస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఆధారంగా తొలి మానవరహిత యుద్ధ విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో గల ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో ఈ మానవరహిత విహంగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. పూర్తి స్వయంచలితంగా ఎగిరే ఈ యుద్ధ విమానం కచ్చితమైన ఎత్తులో టేకాఫ్ అవడంతో పాటు నావిగేషన్., స్మూత్ టచ్‌డౌన్ వంటివి సమర్థంగా నిర్వహించుకుందని తెలిపింది. ఈ విమానాన్ని డీఆర్‌డీఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ సంస్థ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన సాధించేందుకు ఇదో కీలక ముందడుగుగా డీఆర్‌డీఓ అభివర్ణించింది.
మరోవైపు దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి-ఏటీజీఎమ్ను.. డీఆర్‌డీఓ, సైన్యం విజయవంతంగా పరీక్షించాయి. బుధవారం మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో భారత సైన్యం, డీఆర్‌డీఓ సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించాయి. అర్జున్ యుద్ధ ట్యాంకు నుంచి ఏటీజీ క్షిపణిని ప్రయోగించగా అది విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణికి ఉంది.