బిహార్‌లో దారుణం జరిగింది. రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంట్లోకి చొరబడి మరీ చంపినట్లు తెలుస్తోంది. కాగా, ఈ జంట హత్యలు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రొఫెసర్ మహేంద్ర సింగ్ (70) ..వీర్ కున్వర్ సింగ్ యూనివర్సిటీ డీన్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య పుష్ప సింగ్ (65) మహిళ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేసి పదవీ విరమణ తీసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ దంపతులిద్దరూ నవాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కటిరా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, సోమవారం ఉదయం నుంచి లఖ్‌నవూలో ఉంటున్న వీరి కుమార్తె.. తన తండ్రికి ఫోన్ చేస్తున్నా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. అనంతరం ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్లి చూడగా.. ఈ జంట హత్యలు వెలుగులోకి వచ్చాయి. కాగా, సోమవారం మహేంద్ర సింగ్ మృతదేహం డైనింగ్ రూంలో పడి ఉంది. అతడి భార్య పుష్ప సింగ్ మృదేహం బెడ్రూం ఉంది. వారి మృతదేహాలపై గాయాలు.. రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే భోజ్‌పుర్ ఏస్పీ ప్రమోద్ కుమార్ యాదవ్, ఏఎస్పీ హిమాన్షు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.