అసంఘటిత రంగంలో పనిచేసిన పేద వృద్ధ కార్మికుల కోసం ఆర్థిక స్థోమత ఉన్నవారు పింఛన్ల (Donate Pension) నుంచి నిర్ణీత మొత్తాన్ని త్యాగం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో విజ్ఞప్తి చేయనున్నారు. వంట గ్యాస్‌పై రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ ప్రధాని గతంలో ఇచ్చిన పిలుపు సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేయనున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ చేసి గణనీయ మొత్తాల్లో పింఛన్లు (Donate Pension) పొందుతున్న సంఘటిత రంగ సిబ్బంది ఏటా కనీసం రూ.36 వేలను విరాళంగా అందించాలని మోదీ సర్కారు అభ్యర్థించనున్నది. ఈ మొత్తాన్ని అసంఘటిత రంగంలో 60 ఏళ్లు పైబడిన వారికి తలా రూ.3,000 చొప్పున పంపిణీ చేయదలిచారు. ఈ కొత్త ప్రతిపాదనకు 'పింఛన్ విరాళం' అని నామ కరణం చేశారు.
లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి 2018లో ప్రధాన మంత్రి శ్రమయోగి మానధన్ (పీఎంఎస్‌వైఎం) పథకాన్ని చేపట్టారు. దీని కింద అసంఘటిత రంగ కార్మికులు (Donate Pension) నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు పింఛను నిధికి జమ చేస్తే, ప్రభుత్వం అందుకు సమాన మొత్తాన్ని జతచేస్తుంది. కార్మికులకు 60 ఏళ్లు నిండిన తరవాత నుంచి నెలకు రూ.3,000 చొప్పున పింఛను అందుతుంది. 18-40 ఏళ్ల వయోవర్గానికి చెంది, నెల సంపాదన రూ.15,000 కన్నా తక్కువ ఉన్న అసంఘటిత కార్మికులు ఈ స్వచ్ఛంద పింఛను పథకానికి అర్హులు. దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నప్పటికీ ఈ ఏడాది అక్టోబరు వరకు 45.1 లక్షల మంది మాత్రమే పథకంలో చేరారు. మిగిలిన వారికి 60 ఏళ్ల తరవాత ఎటువంటి సామాజిక భద్రతా లేదు. పింఛను విరాళ పథకం ద్వారా వారిని ఆదుకోవాలన్నది మోదీ సర్కారు ఉద్దేశం.