విశ్వాసానికి మారు పేరు.. శునకాలు. ఈ కారణంతోనే మానవులకు వాటితో విడదీయరాని బంధం ఏర్పడింది. కాలంతో పాటు తమ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాయి శునకాలు. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తానాపుర్లో జరిగింది. యజమానిపై జరిపిన తుపాకీ కాల్పులను అడ్డుకునేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు దూకేసింది ఓ శునకం. అనంతరం బుల్లెట్ గాయానికి మరణించింది.
ఇదీ జరిగింది:సుల్తానాపుర్లోని వికవాజిత్పుర్లో ఈ ఘటన జరిగింది. విశాల్ శ్రీవాస్తవ అలియాస్ శని అనే వ్యక్తి.. గ్రామంలో కొన్నేళ్లుగా గోశాల నడిపిస్తున్నారు. ఆదివారం రోజున.. గోశాల ప్రాంగణంలోనే గడ్డి ఉంచడానికి ఓ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న రాంబరన్ పీజీ కాలేజ్ మేనేజర్ అనిల్ వర్మ.. తన డ్రైవర్‌తో వచ్చి ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అనిల్ వర్మ.. తన లైసెన్స్డ్ తుపాకీతో విశాల్పైకి కాల్పులు జరిపాడు.