Does Snake Give Warning Before Bite :పాము కాటేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. విష ప్రభావం ఎక్కువగా ఉంటే.. నిలువునా ప్రాణాలు పోతాయి. అందుకే.. పాము అంటే అందరికీ భయమే. అయితే.. పాము కాటేస్తున్నప్పుడు మనుషులను హెచ్చరిస్తుందా? ఆ హెచ్చరిక ఏ రూపంలో ఉంటుంది? అప్పుడు మనుషులు ఏం చేయాలి? అన్నది ఈస్టోరీలో చూద్దాం.
విషం అనేది పాముల ఆయుధం. దానితోనే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే.. విషాన్ని అవి చాలా జాగ్రత్తగా వాడుతాయి. అయితే.. అవి తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో.. ప్రాణ రక్షణ కోసం మాత్రమే విషాన్ని బయటకు తీస్తాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. అంతేకాదు.. పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయని కూడా చెబుతున్నారు.
ఒక్క కట్లపాము మినహా మిగిలిన అన్ని పాములూ ముందుగానే వివిధ శబ్ధాలతో హెచ్చరిస్తాయట. దాన్ని నిశితంగా గమనిస్తే.. పాము కాటు నుంచి తప్పించుకోవచ్చంటున్నారు. పాములను చూసి మనం భయపడతాం గానీ.. వాటికి కూడా మనుషులంటే భయమే. ప్రాణ భయంతోనే పాములు కాటేసి తప్పించుకునేందుకు చూస్తాయి. పాము ఎదురైనప్పుడు మనుషులు కదలకుండా ఉండిపోతే.. అది పక్కనుంచి వెళ్లిపోతుందని అంటున్నారు.
మీకు తెలుసా? పాము కరిచినప్పుడు ఇలా చేస్తే ప్రాణాలు రక్షించొచ్చు!
పాము కాటు వేసే ముందు ఇచ్చే సంకేతాలు ఏంటి:ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేమని.. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "బుస్స్" "బుస్స్".. అని శబ్ధం చేస్తాయంటున్నారు. అదేవిధంగా.. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేసే ప్రయత్నం చేస్తాయట. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు.