తమిళనాడుకు ఆలయాల నగరం అని పేరు. ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు భారతీయ శిల్పకళా వైభవం అంతా ఇక్కడే ఉందా అనిపించేలా అపురూప ఆలయాలకు నెలవు ఈ ప్రాంతం. అలాంటి తమిళనాడును సుదీర్ఘ కాలం పాలించిన డీఎంకే విధానం మాత్రం నాస్తికత్వం. హిందుత్వం, లౌకికత్వం అని రాజకీయాలు నడిచే భారతదేశంలో ద్రవిడ పార్టీగా గుర్తింపు పొందిన డీఎంకేకు సుదీర్ఘకాలంగా నాస్తికత్వం ఓ విధానం. పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి అయితే కరడుగట్టిన నాస్తికుడిగా గుర్తింపు పొందారు. బతికున్నన్ని రోజులు కరుణానిధి వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా పార్టీ పరంగానూ అదే విధానాన్ని అనుసరించారు.
ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకమంటూ హిందూ పండగలకు శుభాకాంక్షలు కూడా చెప్పని పార్టీ డీఎంకే. ఈ పార్టీలో లక్షలాది మంది హిందూ నేతలు, కార్యకర్తలు ఉన్నా.. ఎప్పుడూ తమ మతాన్ని చాటుకునే వైఖరికి దూరంగానే ఉంటారు. అయితే తండ్రి మరణం తర్వాత డీఎంకే పగ్గాలు అందుకున్న స్టాలిన్.. డీఎంకేను ఆ విధానం నుంచి పక్కకు జరుపుతున్నట్లే కనిపిస్తోంది. శనివారం ప్రకటించిన ఆ పార్టీ మేనిఫెస్టోను పరిశీలిస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది.
హిందువులను ఆకట్టుకునేలా..
హిందువులను ఆకట్టుకునేలా అనేక హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపర్చింది డీఎంకే. హిందూ దేవాలయాలు, పవిత్ర ప్రదేశాల పునరుద్ధరణకు వెయ్యి కోట్ల రూపాయల కేటాయింపు, కొండ మీద ఉండే ప్రముఖ దేవాలయాల వద్ద రోప్-వే ఏర్పాటు వంటి హామీలను ఇచ్చింది. ఇవి కాకుండా అర్చకుల గౌరవ వేతనం పెంపు, ఆలయ ఉద్యోగులకు పింఛను సహా సంక్రాంతి పండగకు బోనస్ ఇచ్చే మార్గాలను అన్వేషిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.